ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అయిన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఎండు మిర్చికి మంగళవారం రికార్డు స్థాయి ధర పలికింది. వండర్ హాట్ మిర్చి రకానికి సీజన్ ప్రారంభంలోనే ఏకంగా రూ. 39 వేల రేటు రావడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇదే సమయంలో రూ. 20 వేలు రాగా, చివరి వరకు రూ. 41 వేలు పలికింది. ఇప్పుడు మాత్రం సీజన్ ముగిసేసరికి రూ. 50 వేలు దాటుతుందని అంచనా వేస్తున్నారు. తెగుళ్లతో మిర్చి తోటలు దెబ్బతిన్నాయని, కానీ మార్కెట్లో ధర చూస్తుంటే కొంత ఊరట కలుగుతోందని రైతులు అభిప్రాయపడుతున్నారు. సీజన్ చివరి వరకు రేటు ఇలాగే కొనసాగితే ఈ సంవత్సరం మిర్చి పంట లాభదాయకంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, పత్తి తర్వాత ఏనుమాముల మార్కెట్‌కి ఎక్కువ వచ్చేది ఎండు మిర్చినే. ఎక్కువగా వండర్ హార్ట్, దేశీ, తేజ, 341 సింగల్ పట్టీ రకాలను రైతులు తీసుకువస్తుంటారు.