రచయిత ఆకట్టుకుంటాడు! - MicTv.in - Telugu News
mictv telugu

రచయిత ఆకట్టుకుంటాడు!

February 16, 2018

హీరో ఇంట్రడక్షన్‌ కోసం ఒక ఫైట్, ఒక పాట, సినిమాలో ఇంకో నాలుగు పాటలు, ఇంకో నాలుగు ఫైట్లు, ఒక కామెడీ ట్రాక్, ఒక వాంప్ కారెక్టర్, ఒక సెంటిమెంట్ ట్రాక్.. ఆఖరిలో హీరో విలన్‌తో ఫైట్  హీరో గెలవడం.. విలన్ చావడం ఇదీ తెలుగు సినిమా పుట్టినప్పటినుంచి ఇప్పటి వరకు అత్యధిక సినిమాల మూస ఫార్ములా.

ఈ మూస ఫార్ములాకు బిన్నంగా  అంతా  కొత్త నటీ నటులతో అద్భుత కథ, కథనం,  స్క్రీన్‌ప్లే, డైరెక్షన్, ఆసక్తి కర సంఘటనలు, సంభాషణలు, ఊహించని మలుపులు వెరసి ఒక  అద్భుత వ్యక్తిత్వ వికాస నవలని చదువుతున్నట్లు సాగుతుంది ఈ రోజు విడుదలైన ‘రచయిత’. ఒక షెర్లాక్ హోమ్ సినిమా చూస్తున్నట్లు ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా, లాగ్ లేకుండా ప్రేక్షకులని ఒక పక్క భయానికి, ఇంకో పక్క ఆశ్చర్యానికి గురి చేసే సస్పెన్స్  థ్రిల్లర్ ఇది.

చిన్నచిన్న సన్నివేశాలను మినహాయిస్తే కేవలం కొద్ది కారెక్టర్లల మధ్య ఒక నిర్మానుష్య ప్రదేశంలో, జనజీవనానికి దూరంగా, అందమయిన సముద్ర ఒడ్డున వున్న ఒక ఇంట్లో కొద్ది మంది మధ్య జరిగే ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలను ఇందులో చూపారు.  చక్కని సంభాషణలు, ఆసక్తి మలుపులు ఈ సినిమాకు ఊపిరి. దర్శకుడు/హీరో అయిన విద్యాసాగర్ చెప్పే ప్రతి డైలాగ్ ఒక ఫిలాసఫీ పుస్తకాన్ని చదివే అనుభూతిని ఇస్తుంది.

సినిమా మొత్తం 1954 సంవత్సరం చుట్టూ తిరుగుతుంది. దర్శకుడు అప్పటి వాతావరణాన్ని, ప్రజల అలవాట్లను ప్రొజెక్ట్ చేయడంలో సఫలం అయ్యారు. కథ దృష్ట్యా సినిమాలో అనేక సన్నివేశాలు గ్రాఫిక్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో చిత్రీకరించారు. అనేక సన్నివేశాల్లో గ్రాఫిక్స్ నాణ్యత  నామమాత్రంగానే వున్నా కథాబలం దృష్ట్యా వాటి ప్రభావం పెద్దగా కనిపించదు. చిన్న బడ్జెట్‌లో తీసిన సినిమా సక్సెస్ అయిందనే చెప్పాలి.