ఈ పావురాన్ని రూ. 14 కోట్లకు కొన్నాడు  - MicTv.in - Telugu News
mictv telugu

ఈ పావురాన్ని రూ. 14 కోట్లకు కొన్నాడు 

November 16, 2020

nngn

అరుదైన వజ్రాలు ఉంటాయి. ఖరీదైన వస్తువులు ఉంటాయి. భారీ ధర పలికే జంతువులు, పక్షులు కూడా ఉంటాయి. ఎంత అరుదైనా వాటి ధరలు వేలల్లోనే ఉంటుంది. కొన్నింటి ధరులు లక్షల్లోపే ఉంటాయి. కానీ ఓ పావురం కళ్లు తిరిగి, దిమ్మతిరిగి కిందపడిపోయే భారీ ధరకు అమ్ముడుపోయింది. ఓ మనిషి దాన్ని అక్షరాలా 14 కోట్ల రూపాయలకు కొన్నాడు. చరిత్రలో అత్యంత ఎక్కువ ధర పలికిన పావురంగా రికార్డు సృష్టించిన ఈ పిట్ట కథ ఏంటో  తెలుసుకుందామా మరి. 

బెల్జియంకు చెందిన ఈ పావురం పేరు ‘న్యూ కిమ్’. ఇది ఆడపావురం. అంత ధర పలికిందటే మామూలు పావురం కాదని అర్థమై ఉంటుంది. అవును, ఇది రేసింగ్ పావురం. రేస్‌లలో రాకెట్‌లా దూసుకెళ్తుంది. దీని వయసు రెండేళ్లు. ఇది 2018లో ఫ్రాన్స్‌లో జరిగిన ‘ఏస్ పీజియన్ గ్రాండ్ నేషనల్ మిడిల్ డిస్టెన్స్’ పోటీల్లో కప్పు కొట్టేసింది. బెల్జియంకు చెందిన పీజియన్ పారడైజ్ సంస్థ ఈ పావురాన్ని ఆన్‌లైన్ వేలం వేసింది. ప్రారంభ ధర 18 వేల రూపాయలుగా ప్రకటించగా ఊహించని ధర పలికింది. చైనాకు చెందిన ఓ వ్యక్తి దీన్ని 14 కోట్ల రూపాయలకు కొనుక్కున్నాడు. దీనితో పిల్లలు పెట్టించి, అమ్ముకోడానికి అతడు కొన్నట్లు భావిస్తున్నారు. న్యూ కిమ్‌కు అంత భారీ ధర పలుకుతుందని తాము అసలు ఊహించలేదని వేలం నిర్వాహకులు ఆశ్చపోయారు. 

రేసు గుర్రాలకు, కుక్కలకు డిమాండ్ ఉన్నట్టే రేసు పావురాలకు కూడా డిమాండ్ ఉంటుంది. గత ఏడాది బెల్జియం దేశానికే చెందిన ‘అర్మాండో’ అనే మగపావురు 11 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ రికార్డును న్యూ కిమ్ బద్దలు కొట్టింది. బెల్జియంలో రేసు పావురాల పెంపకం జోరుగా సాగుతుంటుంది. 20 వేల మంది బ్రీడర్లు ఉన్నారంటే ఆ దేశంలో వాటిపై ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.