ఊరి పేరు ‘రాఫేల్’.. కాంగ్రెస్ గెలిస్తే జైలు ఖాయం! - MicTv.in - Telugu News
mictv telugu

ఊరి పేరు ‘రాఫేల్’.. కాంగ్రెస్ గెలిస్తే జైలు ఖాయం!

April 15, 2019

రాఫేల్ యుద్ధవిమానాల ఒప్పందం రాజకీయాలను ఎలా కుదిపేస్తోందో తెలిసిందే. అనిల్ అంబానీ కంపెనీకి లబ్ధికలిగేలా మోదీ ప్రభుత్వం దాన్ని ఒప్పందంలో భాగం చేసిందని విపక్షాలు మండిపడుతున్నాయి. దీంతో రాఫేల్ (లేదా రఫేల్) స్కాం అంటూ నిత్యం వార్తలు, ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. ఆ సంగతి పక్కనబెడితే ఓ ఊరికి మాత్రం ఈ రాఫేల్ ఒప్పందం చేటు చేసింది. దాని పేరు కూడా రాఫేల్ కావడమే దీనికి కారణం.

ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉందీ పల్లె. కేవలం 200 కుటుంబాలే నివసిస్తున్నాయి. అసలు ఇలాంటి ఊరు ఒకటుందని ఇదివరకు జాతీయ మీడియాకు తెలియదు. రాఫేల్ ఒప్పందం పుణ్యమా అని రాష్ట్రంలో అందరూ దీని గురించే చెప్పుకుంటున్నారు.

Rafel Village Chhattisgarh people Want To Change Its Name Because They Can't Take The Blame Anymore.

‘మేమేదో కోట్లు కొట్టేసిన అవినీతిపరులం అన్నట్లు చూస్తున్నారు. జోకులు వేస్తున్నారు. ఆ విమానాలేంటో, ఆ అవినీతి ఏంటో మాకు తెలియదు. వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు మా ఊరు పేరు చెప్పుకోలేక సిగ్గుతో చచ్చిపోతున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మిమ్మల్ని జైలుకు పంపుతుంది అని భయపెడుతున్నారు. మేం ఏ పాపం చేశాం?  ఈ ఎన్నికల్లో గెలిచే పార్టీలు మా గౌరవాన్ని పునరుద్ధరించాలి. ఊరిపేరు మార్చడమో, మరొకటో చేయాలి ’ అని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై సీఎంను కలవడానికి యత్నించామని, అయినా ఫలితం లేకపోయిందని వాపోతున్నారు. యుద్ధవిమానాల సంగతి పక్కనబెడతే ఈ ఘనత వహించిన గ్రామంలో కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేకపోవడం కొసమెరుపు.