ఒడిశాలో ర్యాగింగ్ రక్కసి.. అర్థనగ్నంగా డ్యాన్స్ చేయించి వేధింపులు - MicTv.in - Telugu News
mictv telugu

ఒడిశాలో ర్యాగింగ్ రక్కసి.. అర్థనగ్నంగా డ్యాన్స్ చేయించి వేధింపులు

August 23, 2019

ర్యాగింగ్ రక్కసి మరోసారి కోరలు చాచింది. యూనివర్సిటీల్లో సీనియర్ల వేధింపులు ఏదో ఒక చోట  శృతిమించుతూనే ఉన్నాయి. ఇటీవల యూపీ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం విద్యార్థులకు గుండు కొట్టించిన ఘటన మరవక ముందే ఒడిశాలో మరో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. ఫ్రెషర్స్ డే వేడుకల్లో జూనియర్లను హింసిస్తూ అర్థనగ్నంగా డ్యాన్స్ చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

వీర్ సురేంద్ర సాయి టెక్నాలజీ యూనివర్సిటీలో జూనియర్ విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు ఏర్పాటు చేశారు. దీంట్లో సీనియర్లు ఓవరాక్షన్ చేస్తూ ర్యాగింగ్ చేయడం ప్రారంభించారు. చెంపలు,వీపుపై ఇష్టం వచ్చినట్టుగా కొడుతూ కాలేజీలో పరిగెత్తించారు. అంతటితో ఆగకుండా ఓ గదిలో అందరిని అర్థనగ్నంగా నిలబెడ్డి డ్యాన్స్ చేయించారు. దీన్ని వీడియో తీస్తూ వెకిలి చేష్టలు చేశారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో పాటు ర్యాగింగ్ నిషేధం పాటించని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం అయింది. 

దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి తక్షణం విచారణకు ఆదేశించారు. ర్యాంగిగ్‌కు పాల్పడిన 52 మంది విద్యార్థులను గుర్తించి కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో పాటు రూ. 2000 జరిమానా విధించారు. అయితే వీర్ సురేంద్ర సాయి టెక్నాలజీ యూనివర్సిటీలో గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినట్టు విమర్శలు వచ్చాయి. ఏడాది క్రితం కూడా 15 మంది విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. కాగా రాష్ట్రంలో ర్యాగింగ్ కేసులు పెరిగిపోతున్నాయని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతీ ఏటా 35 వరకు ర్యాగింగ్ కేసులు నమోదు అవుతున్నట్టు చెబుతున్నారు. వీటిని అరికట్టకుంటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.