రఘుపతి వెంకయ్య.. బయోపిక్ ట్రైలర్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

రఘుపతి వెంకయ్య.. బయోపిక్ ట్రైలర్ వచ్చేసింది

November 9, 2019

టాలీవుడ్‌లో బయోపిక్ జమానా ఇప్పుడు బాగా నడుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ పితామహుడిగా పిలుచుకునే రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా రాబోతోంది. ఆయన పేరుతోనే ఈ సినిమాను రూపొందిస్తున్నారు. బాబ్జీ దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా దీన్ని బయటకు వదిలారు. 

‘సినిమానే ప్రపంచాన్ని మారుస్తుంది. సినిమానే ప్రపంచాన్ని శాస్తింది. ఈ సినిమా లైట్ పడినంత కాలమే ఏ సినిమా వాడైనా వెలుగులో ఉంటాడు’ అంటూ వచ్చే డైలాగ్స్ ఈ ట్రైలర్‌లో అందరిని ఆకట్టుకుంది. విడుదలైన కొన్ని గంటల్లోనే చాలా వరకు వ్యూస్ వచ్చాయి. ఎల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మండవ సతీష్ బాబు ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 29న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు సినిమా బతికి ఉన్నంత కాలం రఘుపతి వెంకయ్య నాయుడు ఘనత ఉండిపోతుందని నటుడు నరేష్ వ్యాఖ్యానించాడు. 

కాగా రఘుపతి వెంకయ్య నాయుడు 1887 అక్టోబర్ 15న మచిలీపట్నంలో జన్మించారు. దక్షిణభారతదేశంలో మొదటిసారి 1916 లో ‘కీచకవధ’ సినిమా తీశారు. తన కుమారుడు సూర్య ప్రకాశ్‌ను కూడా ఇదే రంగంలోకి తీసుకువచ్చారు. ఇద్దరూ కలిసి విశిష్ట సేవలను అందించారు. రఘుపతి వెంకయ్య నాయుడు తన 53వ ఏటా 1941 కన్నుమూశారు. ఆయన సేవలకు గానూ అప్పటి ప్రభుత్వం 1980 నుంచి ఆయన పేరిట చిత్ర పరిశ్రమలో కృషి చేసిన వారికి అవార్డులను ప్రధానం చేస్తోంది.