అసమ్మతి స్వరం వినిపిస్తున్న వైకాపా రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై చర్యల కోసం అధిష్టానం కత్తులు పదును పెడుతుతోంది. కీలకమైన పార్లమెంటరీ కమిటీ నుంచి ఆయనను తప్పించింది. పార్లమెంటు స్టాండింగ్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేచర్ చైర్మన్ బాధ్యతల నుంచి ఆయనను తొలగించింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి ఆ పదవి కట్టబెట్టింది. ఈమేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఓ ప్రకటన విడుదల చేశారు. రఘురామను కమిటీ నుంచి తప్పించాలని వైకాపా పార్లమెంటరీ పక్షం స్పీకర్‌కు పలుమార్లు వినతులు సమర్పించడంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు.
నరసాపురం నుంచి ఎన్నికైన రఘురామకృష్ణరాజు ఆరేడు నెలలుగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిలు సరిగ్గా పాలించడం లేదని, పార్టీ పేరు చెప్పుకుని చాలామంది అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కాగా, హైకోర్టుతో ఏపీ సర్కారు గొడవల నేపథ్యంలో జగన్ తన ముఖ్యమంత్రి పదవి కోల్పోతారని రఘురామ ఈ రోజు మీడియాతో అన్నారు.