తనపై దాడికి కుట్ర జరగుతోందన్నారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వెల్లడించారు. ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు లేదా మూడు రోజుల్లో ఇది జరిగే అవకాశం ఉందని అన్నారు. కొంత మంది దళితులు, క్రైస్తవులతో తనపై దాడి చేయించేందుకు ప్లాన్ చేశారని అనుమానం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన కథనాలు కొన్ని ఓ న్యూస్ ఛానెల్, పత్రికలు ప్రసారం చేస్తున్నాయని పేర్కొన్నారు. హిందువులు మేల్కొని ఈ చర్యలను ఖండించాలని పిలుపునిచ్చారు.
ఇటీవల సహచర ఎంపీ నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఉటంకించారు. తన ఊళ్లోకి రా.. పిచ్చికుక్కను కొట్టినట్టు కొట్టేస్తామని హెచ్చరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమని చెప్పారు. ఏపీలో ఆటవిక రాజ్యం నడుస్తోందని విమర్శించారు. పోలీసు వ్యవస్థపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఓ మతం మన్ననలు పొందేందుకే ప్రయత్నిస్తోందని అన్నారు. కనీసం చట్టంపై వారికి అవగాహన కూడా లేదని సెటైర్ వేశారు. తనకు మద్దతుగా దళిత హిందువులు ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా తాను కొత్త పార్టీ పెడుతున్నట్టు వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. తాను ఇంకా వైసీపీలోనే ఉన్నానని స్పష్టం చేశారు.