డ్రగ్స్ కేసులో సెంట్రల్‌ జైలుకు నటి - MicTv.in - Telugu News
mictv telugu

డ్రగ్స్ కేసులో సెంట్రల్‌ జైలుకు నటి

September 15, 2020

raginii

దేశంలోని సినీ పరిశ్రమల్లో డ్రగ్స్ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. ఇప్పటికే బాలీవుడ్ ను కుదిపేస్తోన్న సంగతి తెల్సిందే. రకుల్ ప్రీత్ సింగ్ మొదలగు టాలీవుడ్ నటీనటుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అలాగే కన్నడ సినీ పరిశ్రమలో కూడా డ్రగ్స్ సంప్రదాయం ఉందని సినీ నిర్మాత ఇంద్రజిత్ లంకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా అందించడంతో పోలీసులు విచారణ వేగం పెంచారు. ఈ కేసులో అరెస్ట్ అయిన నటి రాగిణి ద్వివేదికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆమెను బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైలుకు తరలించారు. పలువురు ప్రముఖులకు డ్రగ్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల రాగిణీ సన్నిహితుడైన రవి శంకర్‌ను అరెస్ట్ చేశారు. 

మరో నటి సంజన గల్రాని, రాహుల్, లూమ్‌ పెప్పర్, ప్రశాంత్‌ రంకా, నియాజ్‌లను వీడియో కాన్ఫరెన్స్‌లో కోర్టులో హాజరు పరిచారు. సంజనకు మినహా మిగతా వారికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. నటి సంజనకు 16వ తేదీ వరకు సీసీబీ కస్టడీని పొడిగించారు. సంజనను మరింతగా ప్రశ్నించాల్సి ఉన్నందున కస్టడీని పొడిగించినట్లు సీసీబీ పోలీసులు తెలిపారు. కన్నడ సినీ పరిశ్రమలో దాదాపు 15 మందికి ఈ వ్యాపారంతో సంబంధం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.  హరియానాలోని రేవారి కుటుంబానికి చెందిన రాగిని బెంగళూరులో జన్మించారు. ఆమె 2009లో ‘వీర మదకారి’ చిత్రంలో సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత కెంపే గౌడ, రాగిణి ఐపీఎస్, బంగారి, శివ చిత్రాల్లో ఆమె నటించి మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.