జమ్ము కశ్మీర్ బుడ్గాం జిల్లాలో గురువారం మధ్యాహ్నం టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ మరణించారు. రాహుల్ భట్ పని చేస్తున్న ఆఫీస్‌లోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు.. విధులు నిర్వర్తిస్తున్న ఆయన్ను పాయింట్ బ్లాంక్‌లో కాల్చి చంపి పరారయ్యారు. ఈ హత్యపై కశ్మీర్ లోయలో కశ్మీరీ పండిట్లు ఆందోళనలు చేస్తున్నారు. జమ్ము కశ్మీర్, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాహుల్ భట్ భార్య మీనాక్షి భట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. చదూరాలో తన భర్త పని చేసేటప్పుడు ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యాడని వివరించారు. అందుకే తనను జిల్లా హెడ్‌క్వార్టర్‌కు బదిలీ చేయాలని రాహుల్ భట్ పలుమార్లు స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఆయన విజ్ఞప్తులను అధికారులు పట్టించుకోలేదని, ఆయనను బదిలీ చేయలేదని ఆవేదన చెందారు. తన భర్తను చంపేందుకు ఆయన కార్యాలయంలోని తోటి ఉద్యోగులే ఉగ్రవాదులతో కలిసి కుట్ర చేసి ఉంటారని ఆరోపించారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కంటతడి పెట్టారు.
కాగా రాహుల్ భట్ అంత్యక్రియలు శుక్రవారం జమ్మూలోని ఆయన స్వస్థలం దుర్గా నగర్ లో జరిగాయి. బంటలాబ్ శ్మశాన వాటికలో ‘‘రాహుల్ భట్ అమర్ రహే’’ నినాదాల మధ్య ఆయన మృతదేహానికి ఆయన సోదరుడు సన్నీ అంత్యక్రియలు నిర్వహించారు. రాహుల్ భట్‌కు ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. వీరు బడ్గాంలోని షేక్‌పొర మైగ్రంట్ కాలనీలో నివసించేవారు.