RAHUL COMENTS ON TRS AND BJP
mictv telugu

టీఆర్ఎస్‌తో పొత్తు ఉండదు.. ప్రజా ధనాన్ని దోచేస్తున్నారు…

October 31, 2022

బీజేపీపై యుద్ధం ప్రకటించి.. దేశ రాజకీయాల్లోకి బీఆర్ఎస్‎తో కేసీఆర్ ప్రవేశించారు. బీజేపీ వ్యతిరేక పార్టీల మద్దతు కూడగట్టుతూ ముందుకుసాగుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ తోను టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాదని వార్తలు గుప్పుమన్నాయి. అటువంటి వార్తలకు, సందేహాలకు నేడు చెక్ పడింది.
టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకునే ప్రస్తకి లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ గానే వస్తామని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పొత్తు వద్దన్న రాష్ట్ర నాయకత్వ నిర్ణయాన్ని సంపూర్ణంగా స్వాగతిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. ప్రజధనాన్ని దోచుకుంటున్న పార్టీలతో కాంగ్రెస్ కలవదన్నారు. సింగిల్ గానే తెలంగాణలో పోటీచేసి అధికారాన్ని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేసారు.

మునుగోడు ఉపఎన్నికలో ఖర్చుచేస్తున్న వందల కోట్లు టీఆర్ఎస్, బీజేపీకి ఎక్కడివని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ప్రజాధనాన్ని దోచుకోంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. బీజేపీ హయాంలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని రాహుల్ ఆరోపించారు. మోదీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలను ప్రణాళికా బద్ధంగా నాశనం చేశారంటూ రాహుల్ మండిపడ్డారు. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒకే విధానాన్ని అవలంబిస్తున్నాయని.. వచ్చే పార్లమెంట్ ఎన్నికలు రెండు సిద్ధాంతాలు మధ్య జరిగే పోరాటమని వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికలు విభజన శక్తులు, సంఘటిత శక్తులకు మధ్య జరిగే పోరాటంగా ఎన్నికలు ఉండబోతున్నాయని స్పష్టం చేసారు. ఇక దేశ ఐక్యత కోసం చేపటట్టిన భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా భారీ మద్దతు లభిస్తుందని రాహుల్ హర్షం వ్యక్తం చేసారు.