భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఉత్కంఠ బరితంగా సాగుతోంది. మొదటి మ్యాచ్‌లో టీం ఇండియా విజయం సాధించగా, గురువారం జరిగిన రెండో టీ20లో శ్రీలంక ఘన విజయం అందుకుంది. మొదట భారత్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటే..లక్యాన్ని చేధించే క్రమంలో బ్యాటర్లు చతికిల పడ్డారు. అక్షర్ పటేల్, సూర్యకుమార్ తప్ప ఎవరూ రాణించకపోవడంతో భారత్ ఓటమి పాలైంది. ఓటమి అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం టీ20 జట్టులో ఉన్న వారందరూ యువ ఆటగాళ్లని..వారి విషయంలో కాస్త ఓపిక పట్టాలని ద్రవిడ్ సూచించాడు. వారిని ఆటను అర్థం చేసుకొని సాంకేతికంగా వారికి మద్దతు నిలవాలని చెప్పాడు.పెద్దగా అనుభవం లేని కుర్రాళ్లు శ్రీలంకపై గొప్పగా ఆడడం అద్భుతమన్నాడు. టీ 20 తర్వాత దశకు కొత్తగా కనిపిస్తామని పేర్కొన్నాడు. వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌పై దృష్టి పెట్టిన సమయంలో యువ ఆటగాళ్లను పరీక్షించే సమయం లభించదని తెలిపాడు. “ఎవరూ కూడా వైడ్, నోబాల్ వేయాలని అనుకోరు. జట్టులోని యువకులకు కొంత అనుభవం లభిస్తోంది..అంతవరకు సహనంతో ఉండాలి. జట్టు పునర్నిర్మాణ దశలో ఉంది. ప్రపంచ కప్ సెమీ-ఫైనల్లో ఇంగ్లాండ్‌తో ఆడిన జట్టులో కేవలం 3-4 ప్లేయర్స్ మాత్రమే ప్రస్తుత జట్టులో ఉన్నారు” అని వెల్లడించాడు.
గత సంత్సరంలో ఆసియా కప్, ప్రపంచ్ కప్‌ల ఓటమి తర్వాత టీం ఇండియాలో భారీ మార్పులు జరుగుతాయని ప్రచారం జరిగింది. ప్రచారాన్ని నిజం చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే టీ20ల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. శ్రీలంకతో సిరీస్‌కు రోహిత్, కోహ్లీ,కేఎల్ రాహుల్ వంటి సీనియర్ ఆటగాళ్లను తప్పించి యంగ్ ప్లేయర్స్‌కు జట్టులో స్థానం కల్పించారు. కెప్టెన్సీ బాధ్యతలను ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించారు. భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ద్రవిడ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇక సీనియర్లు టీ20 జట్టులో కనపడక పోవచ్చనే చర్చ మరింత ఊపందుకుంది.