రాహుల్‌కు తొలి పరీక్షే అగ్నిపరీక్ష! - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్‌కు తొలి పరీక్షే అగ్నిపరీక్ష!

December 4, 2017

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయంగా కనిపిస్తున్నది.  ఈ రోజు పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి ఆఖరు రోజు కాగా ఈ ఉదయం రాహుల్ ఢిల్లీ పార్టీ ఆఫీసులో నామినేషన్ పేపర్లను సమర్పించారు. ఇoకెవరూ నామినేషన్ వేసే పరిస్థితి లేదు కనుక పట్టాభిషేకం లాంఛనమే. అంతకు ముందు రాహుల్ మాజీ ప్రధాని మన్మోహన్,  మాజీ రాష్ట్రపతి  ప్రణబ్ ముఖర్జీలను కలిసి అశీస్సులు తీసుకున్నాడు. రాహుల్ పార్టీ ప్రభను మరింత ముందుకు తీసుకుపోగలిగిన సత్తా వున్నవాడని మన్మోహన్ కొనియాడారు.  

రాహుల్‌ను అధ్యక్షునిగా ప్రతిపాదిస్తూ మాజీ ప్రధాని, తల్లి సోనియాతో పాటు కాంగ్రెస్ ముఖ్య నేతలు గులాం నాబీ ఆజాద్, ఏకే అంటోని, చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్ సంతకాలు చేసారు. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా 19 సంవత్సరాల నుండి వున్న సంగతి తెలిసిందే.

గుజరాత్ ఎన్నికలు రాహుల్ కి కీలకం కానున్నాయి. కొన్ని రోజులుగా రాహుల్ సభలకి  స్పందన వస్తోంది.  మాటల్లో వాడి, వ్యూహాలు  అధికార పార్టీని సైతం ముచ్చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్ ఎన్నికల్లో అధికార పార్టీ బీజేపీ మెజారిటీ, మోడీ ప్రభ ఏ మాత్రం తగ్గినా రాహుల్ విజయవంతం ఐనట్టే అని రాజకీయ వర్గాల్లో చర్చ ఇప్పటికే  మొదలయ్యింది.

ఇప్పటికే గుజరాత్‌లో అసమ్మతి నేతలైన హార్దిక్ పటేల్, దళిత మేధావి జిగ్నేష్ మెవాని, ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్, గిరిజన నేత ఛోటు వాసవ, కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తుండడం బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. ప్రధాని మోడీతో పాటు కాబినెట్ మంత్రులు మొత్తం పాలన గాలికి వదిలేసి విపరీతంగా కాంపెయిన్ చేస్తున్నారు.  బీజేపీ ఘోరంగా ఓడిపోయిన 2015 నాటి ఢిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గుజరాత్‌లో పునరావృతం అవుతాయా కావా అన్నది జాతీయ రాజకీయాల్లో కీలకం కానున్నది.