దిక్కులు చూసే మోదీ.. రాహుల్ హేళన - MicTv.in - Telugu News
mictv telugu

దిక్కులు చూసే మోదీ.. రాహుల్ హేళన

September 25, 2018

రఫేల్ యుద్ధ విమానాల వ్యవహారం కాంగ్రెస్, బీజేపీల మధ్య పెద్ద యుద్ధానికి దారి తీస్తోంది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం కాంగ్రెస్‌కు కలిసొస్తోంది. పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ ఈ వ్యవహారాన్ని ఇంతటితో విడిచిపెట్టడని అర్థమవుతోంది. ఈ ఒప్పందంపై మోదీ మౌనాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ ఎగతాళి చేస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది.  

మోదీ నిజాలు చెప్పడం లేదని, ప్రశ్నిస్తే దిక్కులు చూస్తారంటూ రాహుల్ దిక్కులు చూస్తూ ఎద్దేవా చేశారు. మోదీలా పక్కకు, పైకి, కిందికి చూస్తూ వెటకరించారు. అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ అంబానీ కంపెనీని ప్రజాధనంతో కాపాడేందుకే రఫేల్ ఒప్పందంలో చోటు కల్పించారని ఆరోపించారు. యువకుల నుంచి,  ఎయిర్ ఫోర్స్ నుంచి మోదీ డబ్బులు కొల్లగొట్టి అంబానీ జేబులు నింపాడని తీవ్రంగా విమర్శించారు. అనిల్ ఇప్పటికే రూ.45,000 కోట్ల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టారని, అలాంటి వ్యక్తికి చెందిన కంపెనీకి కీలక ఒప్పందంలో చోటెలా కల్పిస్తారని ప్రశ్నించారు.

ప్రధాని మోదీ తన కళ్లలో కళ్లు పెట్టి చూడలేకపోయారని రాహుల్ అన్నారు. కాగా, ఇటీవల రాహుల్ గాంధీ పార్లమెంటులో కుర్చీలో మోదీని కౌగిలించుకోవడం, తర్వాత కన్నుగీటడం వివాదానికి దారి తీయడం తెలిసిందే. రాహుల్‌కు కుర్చీమీద వ్యామోహమని, టిక్ టిక్ అని కన్నుకొడతాని మోదీ కూడా చేతుసైగలతో ఎగతాళి చేశారు. దానికి జవాబుగానే రాహుల్ మోదీలా దిక్కులు చూస్తూ హేళన చేసినట్లు కనిపిస్తోంది.