ఇంజినీరింగ్ చదివి స్విగ్గీలో పని చేస్తున్నారు : రాహుల్ గాంధీ - Telugu News - Mic tv
mictv telugu

ఇంజినీరింగ్ చదివి స్విగ్గీలో పని చేస్తున్నారు : రాహుల్ గాంధీ

November 1, 2022

ప్రతీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ.. తర్వాత ఆ విషయమే మర్చిపోయారని, యువత ఇంజినీరంగ్ చదివి స్విగ్గీలో పని చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. మంగళవారం భారత్ జోడో యాత్ర హైదరాబాదులో ప్రవేశించగా, కాంగ్రెస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాతగం పలికారు. చార్మినార్ మీదుగా సాగిన యాత్ర ట్యాంక్ బండ్ వరకు సాగింది. అనంతరం నెక్లెస్ రోడ్డలోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ‘మోదీ, కేసీఆర్ ఒకటే. వీరిద్దరి మధ్య ప్రత్యేక కనెక్షన్ ఉంది.

ఎన్నికల ముందు నాటకాలు ఆడడం తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదు. నిరుద్యోగం గురించి ఎవరూ మాట్లాడరు. రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఎయిర్ పోర్టులు, ఎల్ఐసీ, టెలికాం వంటి ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ ప్రభుత్వం అమ్మేస్తోంది. ఇలాగే కొనసాగితే హైదరాబాద్ ఎయిర్ పోర్టును కూడా అమ్మేస్తారు. నోట్ల రద్దు వల్ల చిన్న వ్యాపారులు ఎంతో నష్టపోయారు. కేసీఆర్ ఎప్పుడూ ధరణి పోర్టల్ మీద దృష్టి పెట్టి ఎక్కడ ఖాళీ భూములున్నాయో అని చూస్తుంటారు. ప్రజలు అప్రమత్తం కాకపోతే దేశం అమ్ముడుపోవడం ఖాయ’మని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.