రాహుల్, ప్రియాంక గాంధీల యూపీ పర్యటన ఉద్రిక్తంగా మారింది. హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదు. వారి వాహనాలను 140 కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకున్నారు. దీన్నినిరసిస్తూ.. నేరుగా కాలినడకన బయలుదేరారు. వారినే అనుసరిస్తూ కార్యకర్తలు కూడా వెంట వచ్చారు. ఈ సమయంలో తోపులాట జరిగింది. ఓ పోలీసు అధికారి రాహుల్ గాంధీని నెట్టివేయడంతో ఆయన కిందపడిపోయారు. దీంతో కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకోవడంతో అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు నెట్టేయడం, లాఠీ చార్జీ చేయడంపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో మోదీ మాత్రమే నడవ గలరా.? ఒక సాధారణ వ్యక్తి నడవడానికి లేదా? అని ప్రశ్నించారు. తమ వాహనాలను అడ్డుకున్నారు కాబట్టి కాలినడకన వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తామని చెప్పారు. వారి తీరును నిరసిస్తూ అక్కడే బైఠాయించిన ఆందోళన చేశారు. ప్రియాంక, రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా రాహుల్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఎవరూ రావడానికి వీలులేదని ప్రకటించారు. అయినా కూడా రాహుల్ గాంధీ వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.