హైదరాబాద్‌లో రెండో రోజు కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌లో రెండో రోజు కొనసాగుతున్న రాహుల్ జోడో యాత్ర

November 2, 2022

Rahul Jodo Yatra continues for second day in Hyderabad

హైదరాబాద్‌లో రెండో రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలయింది. ఉదయం 6 గంటలకు బోయిన్‌పల్లిలోని గాంధీయాన్ ఐడియాలజీ సెంటర్ నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం కేపీహెచ్‌బీ మీదుగా యాత్ర కొనసాగుతుంది. యాత్రలో తెలంగాణ వాసుల ముఖ్య పండుగ బోనాలు సంస్కృతిని ప్రతిబింబించేలా కొందరు పోతురాజుల వేషధారణతో సందడి చేశారు. రాహుల్ గాంధీ వారితో సరదాగా డప్పు కొడుతూ గడిపారు. ఇవాళ 27.8 కిలోమీటర్ల మేర నడవనున్నారు. న్యూబోయిన్ పల్లి, బాలానగర్ మెయిన్ రోడ్డు, ఫిరోజ్ గూడ, జింకలవాడ, ముంబై హైవే, మూసాపేట్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ మీదుగా మదీనగూడ వరకు యాత్ర ఉంటుంది. ఉదయం 10 గంటలకు మదీనగూడలోని హోటల్ కినారా గ్రాండ్ వద్ద పాదయాత్రకు విరామం ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు BHEL బస్ స్టాండ్ నుంచి మళ్లీ యాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 7 గంటల సమయంలో ముత్తింగి పాదయాత్రకు విరామం ఇస్తారు. అక్కడే కార్నర్ మీటింగ్ ఉంటుంది. రాత్రికి రుద్రారంలోని గణేష్ మందిర్ సమీపంలో రాహుల్ గాంధీ బస చేస్తారు.

హైదరాబాద్‌లో నిన్న జరిగిన భారత్ జోడో యాత్రకు భారీగా స్పందన వచ్చింది. జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కాంగ్రెస్ శ్రేణులతో పాతబస్తీ వీధులు నిండిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన మల్లిఖార్జున ఖర్గే.. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్నారు. నగరానికి చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలంతా రాహుల్ గాంధీ వెంట నడిచారు. రాహుల్ గాంధీ పాదయాత్ర నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

ఇక జోడో యాత్ర  సందర్భంగా హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు. జోడో యాత్ర కొనసాగుతోన్న అన్ని మార్గాల్లో ఆంక్షలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమల్లో ఉండనున్నాయి. వాహనదారులు విధిగా ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించాలని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ శ్రీనివాస్‌రావు కోరారు.