ఆయన సూటు 11 లక్షలు.. ఈయన జాకెట్ 63 వేలు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఆయన సూటు 11 లక్షలు.. ఈయన జాకెట్ 63 వేలు..

January 31, 2018

రూ. 11లక్షల ఖరీదైన సూటును వేసుకున్నాడంటూ ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  తరచూ విమర్శిస్తుంటారు. ఎదుటివారిపై విమర్శలు చేసే ముందు తను విషయమేంటో జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే రాహుల్ మాదిరే ఇబ్బంది పడతారు. రాహుల్ రూ. 63 వేల విలువైన కోటు వేసుకున్నాడంటూ బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.రాహుల్ ఇటీవల మేఘాలయకు వెళ్లి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన భేటీలో పాల్గొన్నారు. బ్లూ డెనిమ్‌ ట్రౌజర్స్‌, నల్ల జాకెట్‌ వేసుకుని మరీ వెళ్లాడు. ఈ ఫొటోలను చూసిన బీజేపీ.. రాహుల్ వేసుకున్న జాకెట్ చరిత్ర తవ్వింది. దాని ఖరీదు రూ. 63 వేలు అని, ప్రజల కోసం పనిచేసే వారు అంత ఖరీదైన జాకెట్ వేసుకుంటారా? అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ‘సూటు బూటు సర్కార్‌ (మోదీ) మేఘాలయలో నల్లధనాన్ని అరికట్టింది, అవినీతిని నిర్మూలించింది. కాని అధికార కాంగ్రెస్‌ మాత్రం రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు..ఎగతాళి చేస్తోంది’ అని విమర్శించింది.

మోదీ గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో భేటీ సందర్భంగా రూ. 10 లక్షల విలువైన సూట్ వేసుకోవడం తెలిసిందే. తాజాగా రాహుల్ కూడా ఖరీదైన జాకెట్ వేసుకోవడంతో సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. దొందూ దొందేనని, రాహుల్ ప్రధాని అయితే 20 లక్షల సూటు వేసుకుంటారని ఎద్దేవా చేస్తున్నారు. 60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీకి  ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి.