పెద్దాయన ఎంత మంచోడో.. యువరక్తానికి అడ్డుతొలిగాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

పెద్దాయన ఎంత మంచోడో.. యువరక్తానికి అడ్డుతొలిగాడు..

March 20, 2018

మన దేశ రాజకీయనేతల్లో వందకు 80 శాతానికిపైగా ముసలివాళ్లే ఉన్నారు. 70, 80వ పడుల్లోనూ అధికారం కోసం మొక్కవోకుండా పోరాడుతున్నారు. దీంతో దేశగతిని మార్చే శక్తిస్వామర్థ్యాలు ఉన్న యువతకు రాజకీయాల్లో సరైన స్థానం దక్కడం లేదు. తలపండిన వారితో పోలిస్తే యువతలో అవినీతి కాస్త తక్కువే ఉంటుందని చెబుతుంటారు. వారు అధికారంలోకి వస్తే కొంతైనా దేశగతి మారుతుంది. కానీ ముసలాళ్లు పీఠాలకు తుమ్మబంకలా అంటుకుపోతున్నారు. అధకారం, విపక్షం అనే తేడా లేకుండా, వీల్‌చైర్‌లో ఉన్నా, మంచంపై లేవలేని స్థితిలో ఉన్నా పార్టీల్లో కీలక పదవులను అంటిపెట్టుకునే ఉంటున్నారు.

ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే.. ఒక వృద్ధనేత స్వచ్ఛందంగా రాజకీయాల నుంచి తప్పుకున్నందుకు. అది కూడా పార్టీకి సారథ్యం వహిస్తున్న యువనేత హితబోధ విని ఈ పనిచేసినందుకు. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన పార్టీ ప్లీనరీలో వృద్ధ రాజకీయాలను ప్రస్తావించారు. సీనియర్లకు, జూనియర్లకు మధ్య అడ్డుగోడలను కూల్చేసి, ప్రతిభ కలిగిన యువకులతో నవ కాంగ్రెస్ నిర్మించాలని పిలుపునిచ్చాడు. వృద్ధనేతలను విమర్శించకుండానే, యువత పాత్రపై నొక్కి వక్కాణించారు.

ఇది గోవా కాంగ్రెస్ అధ్యక్షుడు, 72 ఏళ్ల వృద్ధుడు శాంతారామ్ నాయక్ మనసులో బలంగా నాటుకుంది. ఉడుకునెత్తురు ఉప్పొంగుతున్న యువతకు కాకుండా తనలాంటి వృద్ధులకు నాయకత్వం సరికాదని పెను పశ్చాత్తాపంతో తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాహుల్ గాంధీకే అందించారు. రాహుల్ ప్రసంగం స్ఫూర్తితో అంకితభావం గల యువతీయువకులకు అడ్డురాకుండా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని నాయక్ చెప్పారు. ఆయన గత ఏడాది జూలైలోనే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. ఆయనలాగే మరికొందరు కాంగ్రెస్ ముసలి నేతలు కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నయి. గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ భరత్‌సిన్హ్ సోలంకి కూడా రాజీనామా చేస్తారని సమాచారం.