Rahul, Surya, India's great victory
mictv telugu

అదరగొట్టిన రాహుల్, సూర్య..భారత్ ఘన విజయం

September 29, 2022

దక్షిణాఫ్రికాపై భారత జట్టు ఘన విజయం సాధించింది. కేఏల్ రాహుల్, సూర్య కూమార్ యాదవ్‌లు అర్ధ సెంచరీలతో అదరగొట్టగా, బౌలర్లలో అర్షదీప్ 3 వికెట్లు, దీపక్ చాహర్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. దీంతో అర్షదీప్‌ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్తే.. దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం రాత్రి జరిగింది. టాస్ గెలిచిన టీమిండియా…దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్‌ను అప్పజేప్పింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అందులో..పార్నెల్ 37 బంతుల్లో ఫోర్, సిక్సర్‌తో 24 పరుగులు చేయగా, మహారాజ్ 31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులు చేశారు. మార్కరమ్ 25 పరుగులు చేశాడు.

అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా..స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 16.4 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి, విజయాన్ని సాధించింది. ఇక, కేఎల్ రాహుల్ (51), సూర్యకుమార్ యాదవ్ (50) అజేయ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. ఈ విజయంతో టీమిండియా 1-0తో సిరీస్‌లో ముందంజ వేసింది. ఇరు జట్ల మధ్య అక్టోబరు 2న గువాహటి వేదికగా రెండో టీ20 జరుగనుంది..