రాహుల్ సభకు అనుమతి ఇవ్వం: ఓయూ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ సభకు అనుమతి ఇవ్వం: ఓయూ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్

April 30, 2022

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట్రంపై దృష్టి సారించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా పార్టీ నాయకులతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తోన్నారు. ఇటీవలే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మే 6వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారని ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా ఓయూలో సభ నిర్వహించి, ఆ తర్వాత వరంగల్ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యేలా నాయకులు ప్లాన్ చేశారు.

సభ నిర్వహణ కోసం ఓయూ యాజమాన్యం అనుమ‌తిని కోరుతూ విన‌తిపత్రం అందజేశారు. సభ నిర్వహణపై చర్చలు జరిపిన ఓయూ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్.. శ‌నివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ అందజేసిన వినతిపత్రాన్ని తిరస్కరిస్తూ, సభకు అనుమతి ఇవ్వమని తేల్చి చెప్పింది. దీంతో రాహుల్ గాంధీ ఓయూ పర్యటన రద్దు కానున్నట్లు సమాచారం.

మరోపక్క రాహుల్ గాంధీ మే 6న వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించ‌నున్న బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రుకానున్నారు. మే 7న హైద‌రాబాద్‌లో పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో స‌మావేశంకానున్నారు. ఓయూలో రాహుల్ గాంధీ కోసం స‌భ నిర్వ‌హించాలని ప్రణాళికలు వేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకలకు ఎదురుదెబ్బ తగిలింది. ఓయూ గ‌వ‌ర్నింగ్ కౌన్నిల్ రాహుల్ గాంధీ స‌భ‌కు అనుమ‌తిని నిరాక‌రిస్తూ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.