రైల్వే ప్రయాణీకులపై మరో భారం.. డైనమిక్ ఛార్జీల పేరుతో బాదుడు
రైల్వే శాఖ ప్రయాణీకులపై మరో బాదుడుకు సిద్ధమైంది. ఇప్పటికే అనేక వర్గాలకు రాయితీలను ఎత్తేసిన రైల్వే శాఖ.. డిమాండ్ ఉన్న మార్గాలలో కొత్తగా డైనమిక్ ఛార్జీలు విధించనుంది. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో మూడు రూట్లలో ఉన్న ఈవిధానం రాబోయే రోజుల్లో మరిన్ని రూట్లకు విస్తరించే ప్రణాళికలో ఉంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ, విశాఖపట్టణం, తిరుపతి రూట్లలో ప్రయాణీకుల నుంచి డిమాండ్ భారీగా ఉంది. రెండు, మూడు నెలల ముందే టిక్కెట్లు బుక్కయిపోతాయి. అయితే అప్పటికప్పుడు లేదా అత్యవసరంగా ప్రయాణించాలనుకునే వారిపైనే ఈ భారం వేస్తున్నామని రైల్వే శాఖ చెప్తున్నా.. అసలు లక్ష్యం మాత్రం ఆదాయం పెంచుకోవడమే. డైనమిక్ ఛార్జీలు ఉండే రైళ్లలో కొత్త విధానం ప్రకారం మొదటి 10 శాతం సీట్లకే సాధారణ ఛార్జీలు ఉంటాయి. తర్వాత 10 శాతానికి అదనంగా 10 శాతం డబ్బులు కట్టాల్సి ఉంటుంది. 20 నుంచి 30 శాతం సీట్లపై 20 శాతం, 31 నుంచి 40 శాతం సీట్లపై 30 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 51 నుంచి 100 శాతం సీట్లపై మాత్రం 50 శాతం అధికంగా ఉంటుంది. అయితే రిజర్వేషన్, కేటరింగ్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఈ విధానం రైళ్ల వారీగా చూస్తే.. రాజధాని, దురంతోలో మాత్రమే డైనమిక్ ఛార్జీలు అమల్లో ఉన్నాయి. ఇతర రైళ్లలో దశలవారీగా అమలు చేసే అవకాశం ఉంది.