కదులుతున్న ఎక్స్ప్రెస్ రైలు చైన్ లాగడంతో అది ఒక నది వంతెనపై ఆగింది. దీంతో తిరిగి సెట్ చేసేందుకు రైల్వే లోకో పైలట్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. మహారాష్ట్ర రాజధాని ముంబై సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 6న ముంబై నుంచి బీహార్లోని ఛాప్రాకు వెళ్తున్న గోదాన్ ఎక్స్ప్రెస్ రైలులోని ఒక ప్రయాణికుడు ఎమర్జెన్సీ చైన్ లాగాడు. దీంతో ముంబైకి 80 కిలోమీటర్ల దూరంలోని టిట్వాలా, ఖడవలి మధ్యలో ఉన్న ఒక నది వంతెనపై ఆ రైలు ఆగింది. చైన్ లాగిన రైలు బోగి కింద ఉన్న అలారం పరికరాన్ని తిరిగి సెట్ చేస్తేనే ఆ రైలు కదులుతుంది. దీంతో దాన్ని రీసెట్ చేయడానికి సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్ సతీష్ కుమార్ సాహసమే చేశారు.
రైలు ఇంజిన్లో ఉన్న ఆయన అతి కష్టం మీద చివరన ఉన్న రైలు బోగికి చేరుకున్నారు. అనంతరం తన ప్రాణాలను పణంగా పెట్టారు. నది వంతెనపై రైలు ఆగి ఉండటంతో ధైర్యం చేసి రైలు బోగి కింద, చక్రాల పక్కన సన్నని సందులోంచి లోపలికి వెళ్లి దాన్ని సరిచేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘ అనవసరంగా అలారం చైన్ని లాగడం చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుంది! అలారాన్ని రీసెట్ చేసేందుకు అసిస్టెంట్ లోకో పైలట్ సతీష్ కుమార్ రిస్క్ తీసుకున్నారు. కాబట్టి.. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎమర్జెన్సీ చైన్ని లాగండి’ అని రైల్వేశాఖ తన ట్వీట్లో ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా అందులో పోస్ట్ చేసింది.
Dedication!
Rectifying ‘Chain Pull’ brake on the bridge. pic.twitter.com/L6VgOfjCeq
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 7, 2022