ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ గత కొంత కాలంగా విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నాయి. నిజంగానే కొన్ని సంస్థలలో మోదీ ప్రభుత్వం ప్రైవేటు రంగానికి అవకాశాలు కల్పిస్తోంది. దీన్ని వారు ప్రభుత్వం చేయాల్సిన పని వ్యాపారం కాదంటూ సమర్థించుకుంటూ వస్తున్నారు. దీంతో దేశాన్ని అమ్మేస్తున్నారంటూ ప్రతిపక్షాలు అధికార బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వేలను కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంటులో స్పష్టతనిచ్చారు.
కొన్ని సంవత్సరాల క్రితం నేషనల్ ట్రాన్స్పోర్టర్ రైల్వేలో పలు దఫాలుగా ప్రైవేటు రైళ్లను ప్రవేశపెట్టాలని నివేదిక ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. 2027 వరకు మొత్తం 151 ప్రైవేటు రైళ్లను నడపాలని సూచిస్తే అందుకునుగుణంగా బిడ్లను ఆహ్వానించామని వెల్లడించారు. అయితే కేవలం రెండు కంపెనీలు మాత్రమే పాల్గొనడంతో బిడ్ను రద్దు చేశామని తెలిపారు. ఇప్పుడు ఆ ఆలోచన ఏమీ లేదని, రైళ్లను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అలాగే ప్యాసింజర్ ట్రైన్లను కూడా ప్రైవేటీకరణ చేసే ఎలాంటి చర్చ జరగలేదని శుక్రవారం మంత్రి పేర్కొన్నారు.