కేంద్రప్రభుత్వం శుక్రవారం తెలంగాణకు ఝలక్ ఇచ్చింది. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తెలంగాణకు కేటాయించట్లేదని కరాఖండీగా చెప్పేసింది. దీంతో కేటీఆర్ వ్యక్తం చేసిన అనుమానం నిజమైంది. విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడతామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే తెలంగాణకు రావాల్సిన ఈ మెగా ప్రాజెక్టు అస్సాంకు తరలిపోయిందని కొద్ది రోజుల కింద మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. అస్సాంలోకి కోక్రాఝర్ కి బీజేపీ పెద్దలు తరలించారంటూ ఆరోపించారు. ఇప్పుడు దాన్ని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా నిజం చేసింది. రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ సమాధానమిచ్చారు. తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయలేమని లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. ఇప్పుడున్న కోచ్ లలో భవిష్యత్తులో అవసరమయ్యే కోచ్ లను తయారు చేసే సామర్ధ్యం ఇప్పుడున్న యూనిట్లకు ఉందని తేల్చేశారు. కొత్తగా వస్తున్న వందే భారత్ రైళ్లను కూడా ఇవి తయారు చేస్తున్నాయని వెల్లడించారు. దీంతో టీబీజేపీ ఇరకాటంలో పడింది. బీఆర్ఎస్ నేతల విమర్శలకు ఏమని సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం అని చెప్పుకునే బీజేపీ తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపిస్తున్నా ఎందుకు నిలదీయడం లేదని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.