Railway police said they opened fire to stop the protesters as they were heading towards the diesel tankers.
mictv telugu

స్టేషన్‌లో 4 వేల లీటర్ల డీజిల్.. అందుకే కాల్పులు జరిపాం.. పోలీసులు

June 17, 2022

Railway police said they opened fire to stop the protesters as they were heading towards the diesel tankers.

ఆర్మీ నియామకాలకు కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ స్కీమ్‌ అగ్గి రాజేసింది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోకి చొరబడిన వందలాది మంది నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోకి పెద్ద ఎత్తున చేరిన నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. రైళ్లను అగ్నికి అహుతి చేశారు. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఈ క్రమంలోనే పోలీసులు ఫైరింగ్‌ చేయడంతో ఓ యువకుడు మరణించిన ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. దాదాపు ఏడు గంటలపాటు నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. దీంతో పోలీసులు పలుసార్లు నిరసనకారులతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు. అయితే విద్యార్థులు దీనికి ససేమిరా అనడంతో పోలీసులు తమదైన శైలిలో స్పందించారు.

అయితే ఆందోళన సమయంలో 1, 2 ప్లాట్‌ఫామ్‌లపై డీజిల్‌ ట్యాంకర్లు ఉన్నాయని, వాటిల్లో 3 నుంచి 4వేల లీటర్ల ఇంధనం ఉందని పోలీసులు తెలిపారు. డీజిల్‌ ట్యాంకర్ల వైపు ఆందోళనకారులు దూసుకెళ్తున్న క్రమంలో వారిని నిలువరించేందుకు కాల్పులు జరిపామని స్పష్టం చేశారు. డీజిల్‌ ట్యాంకర్లకు నిప్పు అటుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉండేదని, డీజిల్‌ ట్యాంకర్లు పేలితే రైల్వేస్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగి ఉండేదని పోలీసులు తెలిపారు. ఒకే సారి 4 వేల మంది పోలీసులు, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ బలగాలు రంగలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

ఇక టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికులు క్యాన్సిల్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని డీఆర్‌ఎమ్‌ గుప్తా తెలిపారు. మీడియాతో మాట్లాడిన గుప్తా.. ‘ఆందోళనకారులు రైల్వే స్టేషన్‌లో సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇప్పటి వరకు రూ. 7 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఆందోళనల్లో 30 భోగీలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 18 ఎక్స్‌ప్రెస్‌, 9 ప్యాసింజర్‌ రైళ్లను రద్దు చేశాము. పలు భోగిలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రయాణికులను సురక్షితంగా బయటకు పంపించాము’’ అని తెలిపారు.