శ్రామిక్ రైళ్లలో మార్పులు.. మిడిల్ బెర్త్ కూడా
శ్రామిక్ రైళ్లు నిలిపే స్టాపుల విషయంలో రైల్వేశాఖ పలు మార్పులు చేసింది. బయల్దేరిన చోటునుంచి గమ్యస్థానం చేరే వరకు మూడు చోట్ల ఆపాలని నిర్ణయించింది. ప్రయాణికుల సంఖ్య కూడా 1200 నుంచి 1700లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రైలు ఆగే మూడు చోట్లా అనుమతి లేకుండా ఒక్కరికి కూడా ప్రవేశం ఉండదని స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తుల మేరకు తాజా మార్పులు చేశామని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలోని పలు చోట్ల చిక్కుకున్న వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు కేంద్రం శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఒక్కో శ్రామిక్ రైలులో 24 బోగీలు ఉండగా.. ఒక్కోబోగీ సామర్థ్యం 72 సీట్లు. భౌతికదూరం నిబంధనల నేపథ్యంలో ఇప్పటివరకు 54 మందిని మాత్రమే ఒక్కో కోచ్‌కు అనుమతించేవారు. తాజాగా మిడిల్ బెర్త్‌ను సైతం భర్తీ చేయాలని నిర్ణయించింది.
కాగ, మొత్తం 468 రైళ్లలో 5లక్షల మంది వలస కూలీలను ఈనెల 1 వరకు తరలించినట్టు రైల్వేశాఖ తెలిపింది. వీటిలో ఇప్పటివరకు 363 రైళ్లు గమ్యస్థానాలకు చేరుకోగా.. మరో 105 రైళ్లు ఇంకా చేరుకోవాల్సి ఉంది. 15 నగరాలను అనుసంధానం చేస్తూ ప్రారంభించే 15 సర్వీసులన్నీ రాజధాని ఎక్స్‌ప్రెస్ తరహారలోనే ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఛార్జీలు కూడా రాజధాని ఎక్స్‌ప్రెస్ తరహాలోనే ఉంటాయని తెలిపారు.