వానమ్మా... నీకు వందనం..! - MicTv.in - Telugu News
mictv telugu

వానమ్మా… నీకు వందనం..!

July 18, 2017

వానస్తే కొందర్కి వలపొస్తది,మరికొందరికి వణుకస్తది,ఇన్నాళ్లకు గుర్తచ్చానా వానా అని  వర్షంలో తడిసి ముద్దయ్యి ఆనందంగా ఉర్రూతలూగే వారు  కొందరైతే,ఇప్పుడెందుకచ్చినవే వాన అని చిరాకు పడేవారు కొందరు,వర్షం పడ్డప్పుడు ఒక్కో మన్షిది ఒక్కో రకమైన అనుభూతి,పంటలేసి ఆశగా ఎదురుచూస్తున్న రైతుకు ఆనందం..ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్తామంటే శనిలా దాపరించింది ఈవాన అని మరికొందర్కి ఆక్రోశం.మిద్దెల్లో ఉండేవాళ్లది ఒకరకమైన ఫీలింగ్,గుడిసెలో ఉండేవారిది ఒకరకమైన ఫీలింగ్.బడికెళ్లే పోరగాన్లది ఒకరకమైన ఫీలింగ్ మూలకున్న ముసలోళ్లది ఒకరకమైన ఫీలింగ్.మొత్తానికి వర్షం అంటే అందరికి అదో రకమైన ఫీలింగ్.

వర్షాన్ని  ఆస్వాదించడంలో సినిమా రచయితలది,ప్రజావాగ్గేయ రచయితలది పూర్తిగా భిన్నం…!

సినిమా సాహితీకారుడికి..ప్రజావాగ్గేయకారుడికి వర్షాన్ని  అభివర్ణించే తీరులో చాలా వత్యాసం ఉంటుంది, సినిమాళ్లు వర్షాన్ని  తమ సిచ్చువేషన్ కి దగ్గట్టు వర్షాన్ని వర్ణిస్తారు ఎలా అంటే నీలో తడిసి తడిసి మది మురిసిందని,నీ వర్షపు చినుకులో నాప్రాయం తడిసిందని..ఇలా తమ అలవాట్లను అభిరుచులను ఆనందాలను,భాదలను..అన్నిటిని వర్షంతో పోలుస్తూ వర్షాన్ని అభివర్ణిస్తారు. జానపద రచయితలు మాత్రం ప్రకృతిలో ఉన్న శెట్లు పుట్టలు వాగులు వంకలు శేను శెల్కలు స్ధితి గతుల గురించి వర్ణిస్తూ  వర్షాన్ని ఆస్వాదించి పాటలు రాస్తారు, వర్షం ఒక్కటే  కానీ సినిమా సాహితీకారులు,ప్రజా వాగ్గేయ కారులు దాన్ని వర్ణించే కోణాలు వేరు.సినిమావాళ్లు వర్షం పడినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటూ..అది పడనప్పుడు నీళ్ల ట్యాంకర్లతో చిమ్మిస్తూ మరీ.. షూటింగ్లు చేస్తుంటారు,ప్రియుడు ప్రేయసి ప్రణయగీతం  వర్షంలోనే తీస్తారు ఫైటింగ్ సీన్లైనా, ఎమోషన్ సీన్లైనా ఇలా ఏమైనా సరే  ,వర్షంలో అదో రకమైన ఫీల్ ఉంటుందని వాళ్ల భావన, వర్షంతో  సినిమాళ్లకున్న ఆ అనుబంధమే వేరు.అందుకే వానమే మీద ఎన్ని పాటలచ్చినా  ఇంకా కొత్తగా గమ్మత్తుగా వస్తూనే ఉంటాయి.మరి జానపద  రచయితలు వర్షం గురించి రాసి పాడిన పాటలు వింటే అర్ధం అవుతుంది..వర్షం పై వాళ్లకున్న అభిప్రాయమేంటో అని.

గోరటి వెంకన్న..వానచ్చెనమ్మ..!

శెట్ల కురుల మీద బొట్లు బొట్లు రాలి..గట్ల బండల మీద గంధమై పారింది,వంకలు డొంకలు వనములన్ని దిర్గి కృష్ణమ్మ వొడికోయి ఇష్టంగ ఒదిగింది…కోనేటి కొలను కాల్వలు,ఊరేటి ఊట సెలిమెలు..పొద్దువేడి పొందుగోరి చిందులాడుతుంటవి..శిందాడే నీటి మువ్వలు ..శిన్నారి శినుకు గవ్వలు…అని  వానమ్మను  తనపదాలతో ఎంతో చక్కగా అభివర్ణించారు గోరటి వెంకన్న.

జయరాజ్… వానమ్మ వానమ్మ !

ఓ వానమ్మ ఒక్కసారి రావమ్మ…నీ అవుసరం మాకేకాదు… శేను శెల్కకు శెట్టుకు శేమకు,పశువులకు పంటలకు మొత్తం ప్రకృతికే నువ్వు కావాలి …వానమ్మ వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అంటూ తన గొంతును వినిపించి…చెట్టు పుట్టలను పాటల్లో ఒంపుకొని పల్లెతల్లిని పలకరించినోడు జయరాజన్న.ఆ పాటలో ఉన్న అనుభూతి అంతా ఇంతా కాదు..వాగుల్లో వంకల్లో..శేనుల్లో శెలకల్లోనేకాదు నిన్ను నమ్ముకున్న రైతు కళ్లలో కూడా నీళ్లు లేవు,సక్కాని మొక్కజొన్న  ఎక్కెక్కి ఏడ్వవట్టే…నీళ్లు వోసుకున్న చేను నీళ్లాడకపాయే…వర్షంరాకపోతే  ప్రకృతికూడా ఎంత తల్లడిల్లుతుందో ఈ పాటలో అద్బుతంగా చెప్పారు.

విమలక్క..చినుకు..చినుకు..!

చినకు చినుకు కురిసిన నేలల శిత్రమైన వాసన అది మల్లెల గంధం అవునో కాదో మట్టి పెల్ల వాసన..మన్ను మిన్ను తల్లి బిడ్డలని వానజల్లు కలిపెనో…ఇలా వర్షం గురించి విమలక్క తనదైన శైలిలో అభివర్ణించారు.

ఇలా సినిమా సాహితీకారులు ఓ వైపు,ప్రజా వాగ్గేయకారులు మరోవైపు  వర్షాన్ని  అభివర్ణించే కోణం భిన్నంగా ఉంటుంది,నిజంగా వానమీద పాటలు  జానపదాలలో  ఎంత  కమ్మగుంటాయో..సినిమా పాటలలో అంత చిలిపిగా ఉంటాయి,వో వానమ్మ  నువ్వంటే  అందరికి ఎంతిష్టముంటే… ఇన్ని పాటలతో ఇన్ని పదాలతో నిన్ను వర్ణిస్తూ…నీలో తడిసి ముద్దై  అనుభూతి చెందుతారు చెప్పు.అందుకే వానమ్మ నీకు వందనం.