తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకున్న మేఘాలు..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సూర్యుడి భగభగల నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. నీలి మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో రాగల 24 గంటల్లో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు.
విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఉపరితలద్రోణి కొనసాగుతోంది. దీంతో ఈనెల 10 లేదా 11న దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. దీని కారణంగా తెలంగాణ, కోస్తా, రాయలసీమల్లో ఉరుమలతో కూడిన వర్షాలు కురవనున్నాయి. పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురిశాయి. పంట చేతికి వచ్చిన సమయం కావడంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.