తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం.. భారీ వర్షాలు పడే ఛాన్స్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఓ వైపు ఎండ, మరోవైపు వానలతో రైతులు సతమతం అవుతున్నారు. ఏ క్షణంలో వర్షం పడుతుందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. పంట చేతికొచ్చిన సమయంలో అకాల వర్షాలు అన్నదాతకు దడ పుట్టిస్తున్నాయి. తాజాగా మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాగాల 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని అంటున్నారు. దీనికి తోడు ఉపరితల ద్రోణి కూడా ఉండటంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్,గుంటూరు, కృష్ణా,నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మరోసారి కూడా పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. రైతులు అప్రమత్తంగా ఉండి.. పంటను కాపాడుకోవాలని సూచించారు. దాదాపు మూడు రోజుల పాటు ఈ ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.