తెలంగాణకు 5 రోజులు పాటు వర్ష సూచన
భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రానున్న 5 రోజులు పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగూ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కొముర్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం పలుచోట్ల పొడి వాతావరణం ఉండడంతో పాటు మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని సూచన చేసింది. మంగళవారం నుంచి జూన్ 3 వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచించింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం 40 నుంచి 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ లో భారీ వర్షం
ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. అప్పటివరకు ఎంద దంచికొట్టగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయి చల్లబడింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాధాపూర్, కూకట్‌పల్లి, అమీర్‌పేట్, ఖైరతాబాద్, కేపీహెచ్‌బీ, దిల్‌షుఖ్ నగర్, ఎల్బీనగర్ పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.