హైదరాబాద్ మహానగరంలో గత రాత్రి కేవలం నాలుగు గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షం నేపథ్యంలో ఏర్పడ్డ ఇబ్బందులను తొలగించడంలో జీహెచ్ఎంసీ సఫలీకృతమైంది. గత రాత్రి 8గంటల నుండి రెండు గంటల మధ్య 12.80 సెంటిమీటర్ల భారీ వర్షం వెస్ట్ జోన్లో, దాదాపు 9 సెంటిమీటర్ల వర్షపాతం సెంట్రల్‌జోన్, ఈస్ట్ జోన్లలో, దాదాపు 6 సెంటిమీటర్ల నుండి 8 సెంటిమీటర్ల వర్షపాతం సౌత్‌జోన్ పరిధిలో కురవడంతో హైదరాబాద్‌లోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, నాలాలు పొంగి రోడ్లపై నీటితో నిలిచాయి.
దీంతో జీహెచ్ఎంసీ ఏర్పాటుచేసిన ఎమర్జెన్సీ మన్సూన్ బృందాలు రంగంలోదిగి నీటి నిల్వలను తొలగించడం, వర్షపునీరు సాఫీగా పోయేవిధంగా చేయడంతో నగరవాసులు పెద్దగా ఇబ్బందులకు గురికాకుండా చేయడంలో విజయవంతమయ్యాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి. జనార్దన్‌రెడ్డి శుక్రవారం రాత్రి వర్షం ప్రారంభం అయినప్పటి నుండి నేటి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు నగరంలో మన్సూన్ బృందాలు చేపట్టిన పనులను తనిఖీ చేయడంతో పాటు వివిధ శాఖలైన వాటర్ వర్క్స్, విద్యుత్, ఫైర్ సర్వీసులు, ట్రాఫిక్ విభాగాల ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి ఎదురైన సమస్యలను పరిష్కరించడంలో సమన్వయపరిచారు. డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ కూడా గత అర్ధరాత్రి నగరంలోని పలు నీట మునిగిన ప్రాంతాలను సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఎన్టీఆర్ స్టేడియం, అశోక్‌నగర్ బ్రిడ్జి, లింగంపల్లి, పోచమ్మ టెంపుల్ బోరబండ, హిమాయత్‌నగర్, రోడ్ నెం-36, వీ.ఎస్.టి, వార్త కార్యాలయం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, బహదూర్‌పుర క్రాస్‌రోడ్స్, పత్తరిగట్టి, మోజంజాయి మార్కెట్, జె.వి.ఆర్ పార్కు, మోడల్ హౌజ్, ఉప్పల్, నాగోల్లతో పాటు దాదాపు 395 ప్రాంతాలు జలమయమయ్యాయి. వీటిని తొలగించడానికి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, డిప్యూటి కమిషనర్ల పర్యవేక్షణలో 121 మన్సూన్ బృందాలు, 50కిపైగా స్టాటిక్ టీమ్స్, 19 సెంట్రల్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగి తక్షణమే స్పందించాయి. దీంతో ఈ సీజన్లో అత్యంత భారీ వర్షం కురిసినప్పటికీ జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యవేక్షణలో ఎమర్జెన్సీ బృందాలు తక్షణమే స్పందించడంతో స్వల్ప సంఘటనలు మినహా నగరవాసులకు ఏవిధమైన ఇబ్బందులు కలగలేదు.
కూలిన 65 చెట్లు
గత రాత్రి కురిసిన భారీ వర్షంకు నగరంలోని పలు ప్రాంతాల్లో 65 చెట్లు కూలిపోగా కూలిన చెట్లన్నింటినీ రోడ్లపై తొలగించి రవాణాకు ఏవిధమైన అంతరాయం లేకుండా చేపట్టామని కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. వీటితో పాటు 395కుపైగా నీటితో నిలిచిన ప్రాంతాలను క్లీయర్ చేశామని తెలిపారు. వానలకు సంబంధించి డయల్ 100కు 95ఫిర్యాదులు, ఆన్లైన్ జీహెచ్ఎంసీకి 87, మైజీహెచ్ఎంసీయాప్ ద్వారా 67 ఫిర్యాదులు అందగా వీటిలో 70 మినహా మిగిలిన అన్నింటినీ పరిష్కరించామని తెలిపారు. 4,180 విద్యుత్ ఫిర్యాదులు అందాయని, ట్రాన్స్ఫర్మర్లు దెబ్బతిన్నాయని, ఐదు విద్యుత్ స్తంభాలు నేలకు ఒరిగాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం ద్వారా సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించామని తెలిపారు.
నీట మునిగిన బస్తీలకు ఆహారం అందజేత
వర్షం వల్ల నీటమునిగిన లోతట్టు కాలనీలు అయిన దీప్తిశ్రీనగర్, మదీనగూడ తదితర ప్రాంతాల్లో ఫుట్ ప్యాకెట్లను అందజేశామని కమిషనర్ తెలిపారు. వర్షంకు దెబ్బతిన్న రోడ్లు, ఇతర నష్టాలను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అంచనా వేస్తోందని పేర్కొన్నారు. ప్రధాన రహదారులలో ట్రాఫిక్‌కు ఇబ్బందులులేకుండా ఉండేందుకు తక్షణ మరమ్మతులు చేపట్టాలని ఆదేశించినట్టు కమిషనర్ వివరించారు.
అత్యవసర సమావేశం
గత రాత్రి కురిసిన భారీ వర్షం నేపథ్యం, రానున్న రెండురోజుల్లో భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో ఎదురయ్యే ఇబ్బందులను మరింత పకడ్బందీగా తొలగించేందుకు నేడు మధ్యాహ్నం జీహెచ్ఎంసీ కార్యాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కమిషనర్ జనార్థన్‌రెడ్డి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విద్యుత్, ట్రాఫిక్, ఫైర్ సర్వీస్‌లు, జలమండలి, వాతావరణ శాఖ, ఎన్.డి.ఆర్.ఎఫ్ విభాగాల ఉన్నతాధికారులతో పాటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారీ వర్షాల సమాచారం అందింన వెంటనే సంబంధిత శాఖల అధికారులు జీహెచ్ఎంసీ కంట్రోల్ రూంకు చేరుకొని ఎమర్జెన్సీ పనులను పర్యవేక్షించాలని కోరారు. గత రాత్రి కురిసిన భారీ వర్షాల ప్రాంతాల్లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు పలు చోట్ల కానరాలేదని ఈవిషయంలో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని ఆదేశించారు.
డాప్లార్ స్టేషన్‌ను సందర్శించిన కమిషనర్
బేగంపేట్‌లోని భారత వాతావరణ శాఖ కార్యాలయాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి నేడు ఉదయం సందర్శించారు. గత రాత్రి అకస్మికంగా దాదాపు 12కుపైగా సెంటిమీటర్ల వర్షపాతం కురవడం మరో రెండు రోజులు ఇదేవిధమైన వర్షపాతం కొనసాగుతుందన్న వార్తల నేపథ్యంలో వాతావరణ శాఖ కార్యాలయానికి వెళ్లి డాప్లర్ కేంద్రాన్ని కమిషనర్ పరిశీలించారు. రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్ నగరంపై రుతుపవనాల ప్రభావంపై వాతావరణ శాఖ అధికారులతో చర్చించారు.