నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లో వర్షం పడుతోంది. మాదాపూర్, గచ్చిబౌలి, చింతల్, బాలానగర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీలో వాన పడుతున్నది. హైదర్‌నగర్, ప్రగతినగర్, నిజాంపేట, బండ్లగూడ, సూరారం, బాచుపల్లితో పాటు తదితర ప్రాంతాల్లో వాన కురుస్తోంది. వర్షంతో పలువురు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
వాతావరణ శాఖ హెచ్చరికలపై జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. 168 వర్షాకాల అత్యవసర టీమ్‌లను ఏర్పాటు చేసిన అధికారులు.. వారిని అలర్ట్‌గా ఉండాలని సూచించారు. వరద ముంపు, రోడ్లపై నీటి నిల్వ వంటి ఇబ్బందులు కలిగితే టోల్ ఫ్రీ నెంబర్ 1912కు కాల్ చేయాలని అధికారులు నగరవాసులకు సూచించారు. వర్షం కురవడంతో చిరు వ్యాపారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రహదారులపై నిలిచిన నీటితో వాహన చోదకులు, పాదచారులకు ఇబ్బందులు తప్పలేదు.