తలైవా తయార్..జూలైలో కొత్తపార్టీ..! - MicTv.in - Telugu News
mictv telugu

తలైవా తయార్..జూలైలో కొత్తపార్టీ..!

May 27, 2017


సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కన్ ఫామ్ అయింది. జూలైలో పార్టీ ప్రకటన రాబోతోంది. ఈ విషయాన్ని రజనీ సోదరుడు సత్యనారాయణ గైక్వాడ్‌ తేల్చిచెప్పారు. అటు తలైవాను ఆహ్వానిస్తూ మదురై జిల్లాలో భారీ ఎత్తున పోస్టర్లు వెలిశాయి. ఇక రజనీ పొలిటికల్‌ ఎంట్రీకి శతృఘ్న లాంటోళ్లు మద్దతు పలుకుతుండగా…ఇది సమయం కాదంటున్నారు కమల్ హాసన్. ఎవరేమన్నా ఫర్ ఫెక్ట్ పొలిటికల్ స్క్రిప్ట్ తో కాలా వచ్చేస్తున్నారు.
తలైవా తయారయ్యారు.మేకప్ కు చెక్ పెట్టి రాజకీయచదరంగం ఆడేందుకు సై అంటున్నారు. అవినీతి కంపుకొడుతోన్న రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనే లక్ష్యంగా జనం ముందుకు రాబోతున్నారు. రీల్ లైఫ్ నుంచి . పొలిటికల్ లైన్ లోకి ఎంటర్ కాబోతోన్న రోబో గ్రౌండ్ వర్క్ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ఎనిమిదేళ్ల తర్వాత అభిమానులతో సమావేశమయ్యారు. మరీ ప్రాంతాల వారీగా. వారి అభిప్రాయాల్ని తెలుసుకుంటూ పక్కా బ్యాలెట్ స్కెచ్ వేస్తున్నారు.
‘యుద్ధం వస్తుంది..అప్పుడు కలుద్దాం…వెళ్లిరండి’ అంటూ రజనీకాంత్‌ అభిమానులతో చెప్పిన మాటలకు సమాధానంగా.. ‘ధర్మత్తిన్‌ తలైవా పోరుకు తయార్‌’ (ధర్మాధినేతా.. యుద్ధానికి మేము సిద్ధం) అని మధురై పోస్టర్లలో రాశారు. కురుక్షేత్ర సంగ్రామంలోని కృష్ణార్జునుల చిత్రాలను, ‘ధర్మం తప్పినప్పుడు అవతరిస్తా’ అన్న శ్రీకృష్ణుడి మాటల్ని రజనీకి ఆపాదిస్తూ ఫ్యాన్స్‌ పోస్లర్లను రూపొందించారు. కళతప్పిన తమిళరాజకీయాల్లో జయలలిత, కరుణానిధి లేని ఈలోటును భర్తీ చేయడం తలైవా వల్లనే సాధ్యమని మదురై అభిమానులు అంటున్నారు.
రజనీకాంత్‌ జులైలో పార్టీని ప్రకటిస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్‌ చెప్పారు. బెంగళూరులో ఉంటోన్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘అవినీతిని అంతం చేయడానికే నా తమ్ముడు రజనీ రాజకీయాల్లోకి వస్తున్నాడు. అది చారిత్రక అవసరం కూడా. పార్టీ పేరు, జెండా, ఎజెండా తదితర విషయాలపై చర్చలు జరుగుతున్నాయి. జులైలో ప్రకటన ఉంటుంది’ అని సత్యనారాయణరావు రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రావాలని, సొంతపార్టీ పెట్టాలని బాలీవుడ్‌ నటుడు, రజనీ స్నేహితుడైన శతృఘ్నసిన్హా ట్వీటర్‌లో కోరారు. తమిళనాడులోని టైటానిక్‌ హీరో, భారతదేశ ముద్దుబిడ్డ, ప్రియమైన రజనీకాంత్‌ లేచిరా.. లేచిరా.. లేచిరా…ఇది తమిళనాడును మీరు పాలించాల్సిన సరైన సమయం అని ట్వీట్‌ చేశారు. ప్రజలు మీతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
అయితే తమిళ స్పృహ ఉన్నవారెవరైనా తమిళనాడులో రాజకీయాల్లోకి రావొచ్చని నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. డబ్బు సంపాదించేందుకే రాజకీయాలనే ధోరణి అందరిలోనూ మారాలని, ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలని రజనీకాంత్‌ చెప్పిన మాటలు సమర్థనీయమన్నారు. ఎవరైనా సరే.. రాజకీయ ప్రవేశానికి ఇది తగిన సమయం కాదని పరోక్షంగా రజనీకాంత్‌కు హితవు పలికారు.
ఎవరిమాటలు ఎలా ఉన్నా తలైవా ఎంటరైతే తమిళనాట పొలిటికల్ ఈక్వేషన్స్ టోటల్ గా మారిపోతాయి. కేంద్ర రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.