Rains for three days in AP
mictv telugu

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి మూడ్రోజులు వర్షాలు

October 4, 2022

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడగా, దానికి అనుబంధంగా సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని, బుధవారం నాటికి తీరం దాటే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తాంధ్రలో తీరం వెంబడి 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, రాయలసీమలో తేలికపాటి జల్లులతో పాటు కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. అంతేకాక, అనూహ్య మార్పులు చోటుచేసుకుని ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశముందని హెచ్చరించింది.