తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు - MicTv.in - Telugu News
mictv telugu

తెలుగు రాష్ట్రాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు

September 27, 2022

తెలంగాణ, ఏపీలలో మూడ్రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి. తిరోగమిస్తున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడడమే దీనికి కారణమని వెల్లడించాయి. వీటి ప్రభావంతో ఈ నెల 30 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపాయి. తెలంగాణలో మూడ్రోజుల తర్వాత రెండ్రోజులు పొడి వాతావరణం నెలకొంటుందని, తర్వాత మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేశాయి.

 

తెలంగాణలో చూస్తే బుధవారం ఉత్తర, దక్షిణ, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది. అలాగే మంగళవారం రోజు హైద్రాబాద్ నగరంతో పాటు యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, కొమురం భీమ్ అసిఫాబాద్, నిర్మల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వానలు పడ్డాయని వివరించింది. అటు తూర్పు – మధ్య బంగాళా ఖాతంలో అక్టోబర్ 1వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అటు ఏపీలో ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా ఇంటి వద్దే ఉండాలని సూచించింది.