తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్లో ఉన్న వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వాటి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా జూలై 2 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.
విడుదల చేసిన ప్రకటనలో.. ”మంగళవారం సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 2 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం ఉదయం మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, మహబూబ్నగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నారాయణపేట జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది”
మరోపక్క మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఉన్నాయని, రాష్ట్రంలో మొన్న ఉదయం నుంచి నిన్న ఉదయం వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు.’ భద్రాద్రి జిల్లా అశ్వాపురంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా మంచిప్పలో అత్యల్పంగా 6.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా సంగారెడ్డిలో 6.4 సెంటీమీటర్ల వర్షం కురవగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేరెడ్మెట్లో అత్యధికంగా 5.4 సెంటీమీటర్ల వర్షం పాతం నమోదైంది’ అని అధికారులు వివరాలను వెల్లడించారు.