Rains till 27th of this month in Telangana
mictv telugu

తెలంగాణలో ఈ నెల 27 వరకు వర్షాలు

July 25, 2022

తెలంగాణ ప్రజలకు హైదరాబాద్‌లో ఉన్న వాతావరణ శాఖ అధికారులు మరో తాజా విషయాన్ని వెల్లడించారు. వర్షాల విషయంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ నెల 27వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కార్యకలపాలు నిర్వహించుకోవాలని ఆదివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు.

 

విడుదల చేసిన ప్రకటనలో..”ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో ఏర్పడిన ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించింది. దీని ప్రభావం వల్ల ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు నారాయణపేట, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపలల్లి, ములుగు, భద్రాద్రి కొత్త గూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూ బాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు ప్రాథమిక హెచ్చరికలు జారీచేస్తున్నాం” అని పేర్కొన్నారు.

తెలంగాణలో ఇటీవలే ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. వర్షాల కారణంగా ప్రజలు, రైతులు నానా అవస్థలు పడ్డారు. పొలాల్లోకి, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పలు నివాసాలు కూలిపోయాయి. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా వంతెనలు, చెరువులు, ప్రాజెక్ట్‌లు వరద నీటితో నిండిపోయి, పలు గ్రామాలకు తీవ్ర నష్టాన్ని కల్గించాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు మరోసారి వర్షాల విషయంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ నెల 27వరకు పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరాలను వెల్లడించారు.