Rains today and tomorrow: Meteorological Department
mictv telugu

ఇవాళ, రేపు వర్షాలు: వాతావరణ శాఖ

August 14, 2022

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు ఓ కీలక విషయాన్ని తెలియజేశారు. రాష్ట్రవ్యావ్యాప్తంగా ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు పడుతాయని, ఇప్పటికే ఆదివారం ఉదయం నుంచి ఆయా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా చిరు జల్లులు పడుతున్నాయని పేర్కొన్నారు.

”రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడవచ్చు. ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో ఉదయం నుంచి చిరు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. వివిధ పనుల కోసం బయటకు వచ్చిన ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. రానున్న మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎల్లుండి కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది” అని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు.

ఈ వర్షాలు ఎందుకు పడుతాయి అనే విషయాన్ని కూడా అధికారులు వెల్లడించారు. ‘ఉత్తర బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వాయుగుండంగా బలపడింది. ఇది వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఈ వాయుగుండం రానున్న 6 గంటలలో పశ్చిమ వాయవ్య దిశగా కదిలి పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది’ అని వాతావరణ కేంద్రం సంచాలకులు వివరించారు.