కుండపోత తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తింది. వదలని వానతో హైదరాబాద్ నగరం తడిసిముద్దవుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి..వానొస్తే ఇవన్నీ కామన్.. కానీ అప్పుడెప్పుడో ఒక్క గుంత కనిపించినా ఖబడ్దార్ అంటూ సీఎం కేసీఆర్ చేసిన హెచ్చరిక గుర్తుంది కదా.. అధికారులు , కాంట్రాక్టర్లు తుచ తప్పకుండా పాటించారు. గుంతల్లో కంకర పోసి కవర్ చేశారు. ఈ వానకు కంకర యమ కింకరగా మారింది. మోకాల్లోతు గుంతలు తయారయ్యాయి. వాహనదారులూ జరభద్రం..ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న ప్రమాదం తప్పదు..జాగో జీహెచ్ఎంసీ జాగో జీహెచ్ ఎం సీ అని ఎంత మొత్తుకున్నా..వాళ్లు మారరంతే…
మెయిన్ రోడ్లలో అక్కడక్కడ గుంతలు కనిపిస్తే…గల్లీ రోడ్లల్లో గుంతలు మట్టి తప్ప ఏదీ కనిపించదు. ఏ రోడ్డు చూసినా దానికోసం, దీని కోసం కాంట్రాక్టర్లు తవ్వి వదిలేసిన దారులు ఇంకుడు గుంతల్ని తలపిస్తున్నాయి. ఇవి వరద నీటిని కాదు మనుషుల్ని మింగేసేటట్టు ఉన్నాయి. కొన్ని చోట్ల ఎంత దారుణంగా ఉన్నాయంటే మూడు నాలుగు అడుగుల గుంతలోకి బండి దిగి మళ్లీ ఎక్కాలి. వీటిపై వస్తున్నట్టే వాహనదారులకు వణుకు పుడుతున్నాయి. బురద గుంటల్లో బండ్లు దొర్లుకుంటూ వస్తున్నాయి. ఏమాత్రం అలసత్వంగా ఉన్నా వాహనదారుల పరిస్థితి అంతే.
ఒక్క పెద్దవానకే దారులు ఇలా ఉంటే ముందు ముందు ఏంటో పరిస్థితి…ఊహించుకుంటేనే నగరవాసులకు నరకదారులు దడ పుట్టిస్తున్నాయి. వరదనీటితో కూకట్పల్లి-మియాపూర్ మార్గంలో వాహనరాకపోకలు స్తంభించాయి. రహదారిపై పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోవడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈసీఐఎల్, కాచిగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. కాచిగూడ క్రాస్‌రోడ్, మాసబ్ ట్యాంక్ కట్టమైసమ్మ ఆలయం, నాంపల్లి టి.జంక్షన్, బల్కంపేట ఎల్లమ్మ ఆలయం, టోలిచౌకి సూర్యనగర్ కాలనీ, తాజ్ ఐలాండ్ జంక్షన్ ప్రాంతాల్లో వర్షపు నీరు రహదారులపై నిలిచిపోయింది. అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్ దగ్గర ఓ చెట్టు విరిగిపడింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 25లో మరో చెట్టు కూలింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉంది. మరో రెండ్రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాలతో చెట్లు విరగడం, రహదారులు, అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీళ్లు చేరడం, రోడ్లపై గుంతలు, ఇతర సమస్యలను నివారించేందుకు అత్యవసర బృందాలను ఏర్పాటుచేసింది. గ్రేటర్ వ్యాప్తంగా 140 వర్షాకాల అత్యవసర బృందాలు, 30 మొబైల్ బృందాలు, 91 మినీ బృందాలు, 19 కేంద్ర అత్యవసర బృందాలను ఏర్పాటుచేసినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి చెప్పారు.
కానీ ఈ బృందాలు ఇంత నగరానికి ఎక్కడ సరిపోతాయో తెలియదు. ఉన్న టీమ్స్ ఎక్కడ పనిచేస్తాయో అంతకన్నా తెలియదు. అందుకే వాహనదారులూ… మన జాగ్రత్తల్లో మనం ఉందాం.. వానలో బండి ప్రయాణం చేస్తుంటే జాగ్రత్తగా ఉండండి..అత్యవసరం ఉంటే తప్ప బయటకు తీయండి. ఉద్యోగులకు ఎలాగూ రోడ్డెక్కడం తప్పదు..సో బీ అలెర్ట్… వాహనదారులూ..