తెలంగాణ వ్యాప్తంగా బుధవారం తెల్లవారు జామున భారీ వర్షాలు కురిశాయి. అల్పపీడనం కారణంగా ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోనూ వర్షం కురవడంతో యాదాద్రి విషయంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణంలో అధికారుల పనితనం ఏంటో తెలిసిపోయింది. తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి యాదాద్రి గుట్టపైనున్న క్యూ కాంప్లెక్స్ లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. యాదాద్రి ఆలయ పరిసరాల్లో రోడ్లు కుంగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆలయ అభివృద్ధిలో కాంట్రాక్టర్లు, అధికారుల పనితనం ఇదేనా అంటూ మండడిపడుతున్నారు. చిన్న వర్షానికే యాదాద్రి అభివృద్ధి పనుల్లో అధికారుల వైఫల్యం కనపించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.