Raised there..raise here too
mictv telugu

అక్కడ పెంచారు..ఇక్కడ కూడా పెంచండి

September 20, 2022

రెండు తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌ల్లోని అసెంబ్లీ సీట్లను పెంచాలని సవాల్ చేస్తూ, గతంలో పర్యావరణ నిపుణులు ప్రొఫెసర్ కె.పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సోమవారం జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ధర్మాసనం ముందు పిటిషనర్ తరపు న్యాయవాది పలు కీలక విషయాలను వెల్లడించారు.

”విభజన చట్టంలో పేర్కొన్నారన్న పేరుతో జమ్మూకశ్మీర్‌లోని అసెంబ్లీ సీట్లను 107 నుంచి 114కి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది. కానీ, అదే సూత్రాన్ని తెలుగు రాష్ట్రాలకు వర్తింపజేయలేదు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కి, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాల్సి ఉంది. 2020 మార్చి 6న ఏర్పాటు చేసిన డీలిమిటేషన్ కమిషన్లో జమ్మూకశ్మీర్‌ను మాత్రమే చేర్చి ఏపీ, తెలంగాణలను చేర్చకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19,21ను విస్మరించడమే. విభజన చట్టం నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించండి” అని ధర్మాసనాన్ని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు.

అనంతరం వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొన్న ఏపీ, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీచేసింది. ఈ రిట్ పిటిషన్‌ను జమ్మూకశ్మీర్ నియోజకవర్గాల పిటిషన్‌ను జతచేయాలని రిజిసీని ఆదేశించింది.