ఏపీలో ఒంటరి మహిళలకు షాక్.. పింఛను వయోపరిమితి పెంపు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ఒంటరి మహిళలకు షాక్.. పింఛను వయోపరిమితి పెంపు

June 18, 2022

ఏపీలో ఉన్న ఒంటరి మహిళలకు ఇచ్చే పింఛను విషయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కొత్తగా ఇచ్చే పింఛన్లకు వయో పరిమితిని పెంచింది. ఇప్పటివరకు 35 ఏళ్లు దాటిన మహిళలకు పింఛను ఇస్తుండగా, దానిని 50 ఏళ్లకు పెంచారు. అవివాహిత మహిళ వయసును సైతం ప్రభుత్వం పెంచింది. రూరల్ ఏరియాలో 30 నుంచి 50 ఏళ్లకి, అర్బన్ ఏరియాలో 35 నుంచి 50 కి పెంచింది. దాంతో పాటు పెళ్లికాలేదని తహసీల్దార్ వద్ద ధృవపత్రం తీసుకురావాల్సి ఉంటుంది. అంతేకాక, పెళ్లి కాకపోయినా కుటుంబం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదనే డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది. ఇవే నిబంధనలు భర్త నుంచి విడిపోయిన స్త్రీలకు కూడా వర్తిస్తుంది. భర్తను వదిలి లేదా భర్త వదిలేసిన కనీసం ఏడాది తర్వాత పింఛనుకు అర్హులవుతారు. అలాంటి మహిళలు ఒంటరిగా ఉంటున్నట్టు నిరూపించాలి. ఈ మేరకు పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు.