Raj Bhavan office gave a counter to Education Minister Sabita over university bill
mictv telugu

రాజ్ భవన్ VS ప్రగతి భవన్.. మంత్రి సబితకు తమిళిసై కౌంటర్

November 8, 2022

గత కొంతకాలంగా సద్దుమణిగిందనుకున్న రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ వివాదం మళ్లీ ముదురుతోంది. యూనివర్సీటీల్లో నియామకాల బిల్లు పెండింగ్ అంశం దీనికి కారణమైంది. ఈ బిల్లు విషయంలో న్యాయ పరమైన అంశాలపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజ్ భవన్‌‌కు రావాలని సూచించగా.. మంత్రి సబిత తనకు ఎలాంటి సమాచారం పంపలేదని చెప్పడంతో వివాదాస్పదంగా మారింది.

దీనికి వెంటనే రాజ్ భవన్ కార్యాలయం కౌంటర్ ఇస్తూ.. మంత్రి సబితకు సోమవారమే మెసేంజర్‌‌‌లో సమాచారమిచ్చామని, ఉద్దేశపూర్వకంగానే రాజ్ భవన్‌‌పై కుట్ర చేస్తున్నారని పేర్కొంది. యూనివర్సిటీ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డులో నియామకాలపై యూజీసీతో పాటు మంత్రికి కూడా లేఖ రాశామని వివరించింది. అయితే తనకు ఎలాంటి లేఖ రాలేదని, వస్తే స్పందించడానికి సిద్ధంగా ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలు గవర్నర్ కార్యాలయం మానుకోవాలని సబిత సూచించారు. కాగా, గతంలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రభుత్వం ప్రతిపాదించగా.. గవర్నర్ ఆమోదించకుండా పెండింగులో పెట్టడంతో విభేదాలు మొదలయ్యాయి. అవి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి.