RAJAGOPAL REDDY SON CLARITY ON SUSI INFRA CONTRACT
mictv telugu

18 వేల కోట్ల కాంట్రాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి తనయుడు

October 31, 2022

RAJAGOPAL REDDY SON CLARITY ON SUSI INFRA CONTRACT

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం రసవత్తరంగా సాగుతోంది.పోలింగ్ తేది దగ్గరపడుతున్న కొద్ది నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీకి రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారని..18 వేల కోట్ల కాంట్రాక్టుకు దక్కించకోని కాషాయ కండువా కప్పుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలను రాజగోపాల్ రెడ్డి తిప్పికొడుతున్నారు. తాజాగా ఆయన కుమారుడు, సుశీ ఇన్ ఫ్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సంకీర్త్ రెడ్డి సోమవారం ఓ వివరణ ఇచ్చారు.

సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఈ వివరణలో సంకీర్త్ రెడ్డి… తమకు దక్కిన కాంట్రాక్టుకు సంబంధించిన కాపీని కూడా జత చేశారు. సంకీర్త్ రెడ్డి పోస్ట్ ప్రకారం “ఝార్ఖండ్ లోని చంద్రగుప్త్ కోల్ మైన్ బొగ్గు గనుల తవ్వకానికి గ్లోబల్ టెండర్లను 2020 జూన్ 30న ఆహ్వానించింది. ఈ టెండర్‌కు స్పందించిన అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, అరబిందో, మహాలక్ష్మీ, ట్రైడెంట్ కన్సార్టియం, మాంటెకార్లో లిమిటెడ్‌లు తమ బిడ్లను దాఖలు చేశాయి. వీటిలో అదానీ గ్రూప్ అతి తక్కువకు కోట్ చేసినా… ఈ ధరలు ఆమోదయోగ్యం కాదని సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ఆ టెండర్లను రద్దు చేసింది. అయితే అదే పనికి 2021 ఫిబ్రవరి 30న సీసీఎల్ మరోమారు గ్లోబల్ టెండర్లను పిలుస్తూ పాత ప్రకటనను యథాతథంగా జారీ చేసింది. ఈ టెండర్ నోటీస్‌కు గతంలో బిడ్లను దాఖలు చేసిన అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, మాంటెకార్లో లిమిటెడ్ తో పాటు సుశీ ఇన్‌ఫ్రా కూడా బిడ్‌ను దాఖలు చేసింది. బిడ్లను తెరచిన సీసీఎల్ ఎల్1 గా నిలిచిన సుశీ ఇన్‌ఫ్రాను చర్చల కోసం ఆహ్వానించింది. టెండర్ బిడ్‌లో టన్నుకు రూ.648 కోట్ చేసిన సుశీ ఇన్ ఫ్రా కేంద్రంతో జరిగిన చర్చల్లో మరింత తక్కువ ధర టన్నుకు రూ.538.29కే ఒప్పుకుంది. దీంతోనే సుశీ ఇన్ ఫ్రాకు ఈ టెండర్ దక్కిందని సంకీర్త్ రెడ్డి చెప్పారు.