Rajagopal Reddy will give a return gift to KCR
mictv telugu

కేసీఆర్‌‌‌కి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. ఒక్కసీటు కూడా దక్కనివ్వను : రాజగోపాల్ రెడ్డి శపథం

November 9, 2022

Rajagopal Reddy will give a return gift to KCR

మూడు ప్రధాన పార్టీలను మునుగోడు ఉప ఎన్నిక చాలా టెన్షన్‌‌లో పెట్టింది. వచ్చే సాధారణ ఎన్నికలకు ఈ ఎన్నిక సెమీఫైనల్‌‌గా భావించి ఎత్తుకు పైఎత్తు వ్యూహాలు రచించి హోరాహోరీగా పోరాడాయి. చివరికి గులాబీ జెండా ఎగరడంతో.. రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అధికారంలో రావడం కష్టమనే కామెంట్లు వినిపించాయి.

అటు గెలుస్తామనుకున్న చోట ఓటమికి గల కారణాలను వెతికే పనిలో ఆ పార్టీ పడింది. అందులో భాగంగా అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. ఆ భేటీలో 9 మంది నాయకులు ఓపెన్ అయి పోల్ మేనేజ్‌‌మెంటులో ఫెయిలవడం వల్ల ఓడిపోయామని చెప్పినట్టు తెలిసింది. ఆ సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీరియస్ అయ్యారని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఆ భేటీలో రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ కేసీఆర్‌‌కు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. 2023 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 12 స్థానాలు గెలిచి అమిత్ షాకు కానుకగా ఇస్తానని చెప్పారు. అంతేకాక, ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ పార్టీకి దక్కనివ్వనని, నల్గొండను కాషాయమయం చేస్తానని శపథం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ బలగం అంతా వచ్చి యుద్ధం చేసింది. కానీ 2023లో ఆ పరిస్థితి ఉండదు. మునుగోడులో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా చూసుకొని పనిచేస్తా. తనపై కేసీఆర్ అధర్మ యుద్దం చేసినా తాను ధర్మ యుద్ధమే చేసి గులాబీ పార్టీకి జిల్లాలో ప్రాతినిధ్యం లేకుండా చేస్తానని ఛాలెంజ్ చేశారని చెప్తున్నారు. ఓటమిని జీర్ణించుకోలేని రాజగోపాల్ రెడ్డి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని సన్నిహితుల వద్ద కూడా అన్నట్టు తెలుస్తోంది. మరి 23లో ఏం చేస్తారో చూడాలి మరి.