Rajagopal Reddy's resignation..Celebrations at Gandhi Bhavan
mictv telugu

రాజగోపాల్ రెడ్డి రాజీనామా..గాంధీభవన్‌లో సంబరాలు

August 3, 2022

తెలంగాణ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు మండలం ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా వ్య‌వ‌హారం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? లేదా? అనే విషయంపై చర్చోపచర్చలు జరిగాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి, త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్రకటించారు.

కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ..”నా రాజీనామా ద్వారా మునుగోడు ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని భావిస్తున్న‌ా. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో బ‌ల‌హీన ప‌డ‌టంతో పార్టీలో ఉండి కూడా నేను ఏమీ చేయ‌లేక‌పోయాను. నా జిల్లాలోనే అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు చేసే నేత‌లు ఉన్నారు. కాంట్రాక్టుల కోస‌మే కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాన‌ని కొంద‌రు ఆరోపిస్తున్నారు. నా రాజీనామాతో మునుగోడుకు జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌లో ఎవ‌రు గెలవాలనేది ప్రజలే నిర్ణయిస్తారు” అని ఆయన అన్నారు.

అయితే, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అటు ఎమ్మెల్యే పదవికి, ఇటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో హైదరాబాద్‌లో ఉన్న గాంధీభవన్‌లో ఎస్ఎస్‌యూఐ నాయకులు తెగ సంబరాలు చేసుకున్నారు. ఎస్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆదేశాలతో కార్యకర్తలు మంగళవారం రాత్రి గాంధీభవన్‌లో పటాసులు కాల్చుతూ, రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇన్నాళ్ల కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని విరగడైందని బాణసంచా కాల్పారు. ఉప ఎన్నికల్లో మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు.