ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడిని రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కాపాడిన వీడియో వైరల్ అవుతోంది. రోడ్డు కం రైలు బ్రిడ్జిపై నుంచి నదిలోకి యువకుడు దూకే యత్నం చేయగా, అదే సమయంలో గోపాలపురంలో శుభ కార్యానికి వెళ్తున్న లోకల్ ఎంపీ భరత్ గమనించి చాకచక్యంగా వ్యవహరించి చొక్కా పట్టుకుని వెనక్కి లాగారు. ఫుట్‌పాత్ నుంచి రోడ్డు మీదకు బలంగా లాగిన తర్వాత తన అనుచరుల సాయంతో అతని ఇబ్బంది ఏంటనేది తెలుసుకోవడనికి ప్రయత్నించినా పొంతనలేని సమాధానం చెప్తుండడంతో టూటౌన్ సీఐ గణేష్‌కి కౌన్సిలింగ్ ఇమ్మని అప్పగించారు.
విచారణలో యువకుడిది నిడదవోలు మండలం ఉనకరమిల్లి గ్రామవాసి అయ్యప్ప అని తేలింది. పేరెంట్స్‌కి ఆరో సంతానమని, తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేశానని వెల్లడించాడు. చదువు పూర్తయ్యాక తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల పరిసర ప్రాంతంలో ఉన్న అరబిందో ఫార్మసీలో మూడేళ్లు ఉద్యోగం చేసినట్టు పోలీసులకు తెలిపాడు. అయితే ఆత్మహత్యకు గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదని సమాచారం. కాగా, యువకుడిని సమయస్పూర్తితో కాపాడిన ఎంపీని స్థానికులు అభినందించారు.