ప్రేమవిజయం.. నన్‌ను పెళ్లాడిన రాజమండ్రి కుర్రాడు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రేమవిజయం.. నన్‌ను పెళ్లాడిన రాజమండ్రి కుర్రాడు

November 30, 2019

వారి ప్రేమ సరిహద్దులను కూడా చెరిపేసింది. దేశాలు వేరు, భాషలు వేరు, మతాలు కూడా వేరు. పైగా అమ్మాయి సన్యాసిని కూడా.  అయితేనేం వారి ప్రేమ ఆ హద్దులను పటాపంచలు చేసింది. వారిద్దరు ఒక్కటి కావడానికి కొన్ని కట్టుబాట్లను కూడా వదులుకున్నారు. మెక్సికోకు చెందిన ఆ అమ్మాయి దైవ సేవకు అంకితమైన ‘నన్‌’. అతడు ఏపీలోని రాజమహేంద్రవరంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌. వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ భారత్, మెక్సికోకు లంకె కలిపింది. మూడేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంట తమకు అడ్డుగా ఉన్న అన్నింటినీ తెంచుకుని ఆనందమయ జీవితం కోసం పెళ్లితో ఒక్కటయ్యారు. 

ఆచంట ఉమేశ్‌కు టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో పేరు ఉంది. 2016లో మెక్సికోకు చెందిన మావి సునేమ్‌ కస్దరెహోన్‌ సాలాస్‌ అనే యువతి ఎల్‌ఎల్‌డీఎం చర్చి తరఫున రాజమహేంద్రవరంలో చర్చి కట్టే నిమిత్తం ఇక్కడకు వచ్చింది. ఉమేశ్‌ ఆఫీసుకి వెళ్లేదారిలోనే ఈ చర్చి నిర్మాణం మొదలైంది. రోజూ అటుగా వెళ్తున్న ఉమేశ్‌ ఆమె అందానికి ఫిదా అయ్యాడు.  మెల్లగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.

Love Marriage.

అదికాస్తా ప్రేమగా మారింది. మూడు నెలలు వారిద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత సునేమ్‌ స్వదేశానికి వెళ్లిపోయింది. మూడేళ్ల నుంచి వారి ప్రేమబంధం మరింత బలపడింది. ఇక ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సహజంగా ప్రేమికులకు కులం, మతం, ప్రాంతం ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. వీరికి కూడా అదనంగా దేశాల సమస్య ఎదురైంది. ఉమేశ్ కుటుంబసభ్యులు వారి పెళ్లికి ఒప్పుకున్నారు గానీ, సునేమ్‌ ‘నన్‌’ కావడంతో వివాహం చేసుకునేందుకు మెక్సికోలోని చర్చి పెద్దల అనుమతి తీసుకోవాల్సి వచ్చింది. వారు కూడా అభ్యంతరం పెట్టకపోవడంతో ఉమేశ్‌, సునేమ్‌ వివాహం ఈనెల 17న మెక్సికోలోనే జరిగింది. ఉమేశ్‌, సునేమ్‌ దంపతులు శనివారం రాజమహేంద్రవరం వచ్చారు. వారికి ఉమేశ్‌ తల్లిదండ్రులు పద్మావతి, బాలాజీ ఘనంగా స్వాగతాలు పలికారు.