Rajamouli talked about Mahesh Babu movie in america
mictv telugu

మహేష్ మూవీ నా కెరీర్‌లోనే పెద్దది : అమెరికాలో రాజమౌళి

October 1, 2022

తెలుగు సినిమా ఖ్యాతిని బాహుబలితో దేశానికి, ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకుడు రాజమౌళి. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అక్కడ ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచంలోనే అతిపెద్ద థియేటర్‌లో ప్రదర్శించగా, టిక్కెట్ల కోసం ప్రేక్షకులు క్యూ కట్టి తీసుకున్నారు. నాటు నాటు పాట వస్తున్నప్పుడు ప్రేక్షకులు మనలాగా స్క్రీన్ వద్దకు వచ్చి స్టెప్పులేశారు. సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అనంతరం స్టేజిపైకి వచ్చి రాజమౌళి మాట్లాడుతూ తన తదుపరి సినిమా గురించి చెప్పాడు. మహేశ్‌తో చేయబోయే సినిమా తన కెరీర్‌లోనే పెద్దదని, అలాంటి సినిమా ఇప్పటి వరకు చేయలేదన్నాడు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి కథ అని మరోసారి ఉద్ఘాటించారు. ఇప్పటికే ఈ సినిమా ఇండియాలో ట్రెండ్ అవుతోందని వెల్లడించాడు. ‘నేను అమెరికాలో హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్‌కి వచ్చాననుకున్నాను. కానీ, ఇప్పుడు చూస్తే అమెరికా.. అమీర్ పేటలా కనిపిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. దీని ప్రకారం చూస్తే మహేశ్ సినిమా పాన్ ఇండియా స్థాయిని దాటి పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతుందని మహేశ్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు.